బీజేపీ గెలుపు ఖాయం
- రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్
- బీజేపీతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి
- హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
- బీఆర్‌ఎస్ హయాంలో అరాచకాలు
- తెలంగాణ ఏర్పాటులో బీజేపీ సహకారం
- రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్
- వరంగల్, భువనగిరిలో పర్యటన
హనుమకొండ, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, -రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటేనే రాష్ట్ర భవిష్యత్తు మరింత వేగంగా మారుతుందని పేర్కొన్నారు.
సోమవారం వరంగల్, భువనగిరి పర్యటనలో ఆయన మాట్లాడారు. నేడు తెలంగాణ రాష్ట్రంగా ఉందటే సర్దార్ వల్లభాయి పటేల్ కృషి ఉన్నదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ఎటువంటి లాభపేక్ష లేకుండా బీజేపీ సహకరించిందని, తాము ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడుతామని, అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తామని చెప్పారు. ప్రతి ఇంటికి బీజేపీని తీసుకెళ్లడమే ప్రధాన కర్తవ్యం అని కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
తెలంగాణలో ప్రజల ఉత్సాహం చూస్తుంటే 2028లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం అని జోస్యం చెప్పారు. రాహుల్‌గాంధీ పార్ట్ టైమ్ పొలిటిషన్ అని, బీజేపీ ప్రతి కార్యకర్త ఫుల్ టైమ్ పొలిటిషన్ అని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో అరాచక పాలన సాగిందని, కేవలం కుటుంబం కోసమే పనిచేశారని విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడం, మర్చిపోవడం నినాదంగా మారిందన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి ఏటీఎంగా మారిందని ఆరోపించారు. మాజీ ప్రధాని పీవీకి కూడా కాంగ్రెస్ ఆవమానించిందని, బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు బీజేపీ శ్రేణులు వివరించాలని, హామీల అమలుకు పోరాటం చేయాలని సూచించారు. గత బీఆర్‌ఎస్ తప్పులనే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్నదని, కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే అవినీతి ఉన్నదని విమర్శించారు.
మత ఆధారంగా రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుందని, దాన్ని బీజేపీ ఒప్పుకోదని స్పష్టం చేశారు. కాగా కరోనా టైంలో 80 కోట్ల మందిని రక్షించిన ఘనత ప్రధానమంత్రి మోదీదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీతో స్థానికులకు ఉద్యోగవకాశాలు వస్తున్నాయని నితిన్ నబిన్ అన్నారు. గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కమలం జెండా ఎగరాలని, 2028లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సెమీఫైనల్స్ అన్నారు. వికసిత్ వరంగల్, వికసిత్ తెలంగాణ బీజేపీ నినాదం అని చెప్పారు.
కాంగ్రెస్ హామీలపై నిలదీయండి: కేంద్ర మంత్రి బండి సంజయ్
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ నేతలను గల్లా పట్టి నిలదీయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం హైదరాబాద్ తరువాత అత్యధికంగా నిధులిచ్చింది వరంగల్ కార్పొరేషన్ కేనని చెప్పారు.
స్మార్ట్ సిటీ నిధులన్నీ నాటి బీఆర్‌ఎస్ నేతలు స్వాహ చేశారన్నారు. అందుకే చినుకు పడితే వరంగల్ మునిగిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. ఈసారి వరంగల్ కార్పొరేషన్ లో మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చూపిస్తామని చెప్పారు. ‘రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి మంచి వాతావరణం ఉంది. ఈసారి ఎప్పుడు ఎన్నికలొచ్చినా తెలంగాణ గడ్డమీద ఎగిరేది కాషాయ జెండానే’ అని ధీమా వ్యక్తం చేశారు.
వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుస్తాం: రాంచందర్‌రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. రానున్న గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వరంగల్ నగరానికి వెయ్యి కోట్లకు పైగా నిధులు ఇచ్చి అభివృద్ధి చేసిందని చెప్పారు. ఒక్క వర్షం పడితే హైదరాబాద్ మునిగినట్టే వరంగల్ మునుగుతుందని, వరంగల్ ప్రజల అభివృద్ధి కోసం మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవాలన్నారు. వరంగల్‌లో బీజేపీ గెలిస్తే కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తామని చెప్పారు.
వరంగల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా?: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
వరంగల్‌పై ప్రధాని మోదీకి అత్యంత అభిమానం ఉన్నదని, హైదరాబాద్ తర్వాత అంతలా అభివృద్ధి చెందినది వరంగల్లే అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. వరంగల్‌ను గత 13 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం 17వేల కోట్ల ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేస్తుందని చెప్పారు. 2014 ముందు కాంగ్రెస్ పార్టీ పది సంవత్సరాలు, తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు బీఆర్‌ఎస్ పార్టీ, ఈ రెండున్నర సంవత్సరాలుగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి వరంగల్ అభివృద్ధి కోసం ఏం చేశారని విమర్శించారు.
వరంగల్ అభివృద్ధిపై వరంగల్ చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. నరేంద్ర మోడీ ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా అమలు చేస్తారని, ఆరు గ్యారంటీలు ఇచ్చి వెన్నుపోటు పొడిచే సంస్కృతి కాదన్నారు. వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్లో అభివృద్ధి, మహబూబాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి, వరంగల్ కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, పీఎం మిత్ర టెక్స్‌టైల్స్ పార్క్, కాజీపేట బల్లర్ష థర్డ్ లైన్, కాజీపేట విజయవాడ మూడో రైల్వే ప్రాజెక్టు, దక్ష భారతదేశంలో ఏకైక రైల్ ఫ్యాక్టరీ, జనవరి లోపు రైలు కోచ్ ఫ్యాక్టరీ ప్రారంభం జరుగుతుందన్నారు.
ఎయిర్‌పోర్టు పనులను వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. వరంగల్ నుంచి కరీంనగర్ కరీంనగర్ నుంచి హైదరాబాద్ హైవే లను త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. 1200 రూపాయల కోట్లతో జాతీయ రహదారులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. హనుమకొండ వరంగల్ లకు కలిపి 100 ఎలక్ట్రికల్ బస్సులను అందిస్తామన్నారు.






