1 August, 2026 | 6:27 PM

Breaking News

అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు

01-08-2026 05:45 PM

విద్యార్థుల నుండి అడ్మిషన్ పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుండి వసూలు చేసిన 4 వెయిల రూపాయలను తిరిగి ఇవ్వాలి

బాధ్యతరహితంగా తల్లిదండ్రులు తో విద్యార్థులతో  వ్యవహరిస్తున్న ప్రిన్సిపల్ ని తొలగించాలి

విద్యను వ్యాపారం చేస్తున్న లిటిల్ స్కాలర్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ఆందోళన

 పుస్తకాలు అమ్ముతున్న గదిని సీజ్ చేయించిన నాయకులు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్థానిక లిటిల్ స్కాలర్ పాఠశాలలలో విద్యార్థి సంఘాలు శనివారం ఆందోళనకు దిగారు. అనంతరం పుస్తకాలతో కూడిన గదిని విద్యాశాఖ అధికారులతో సీజ్ చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ లిటిల్ స్కాలర్ యాజమాన్యం విద్యార్థుల నుండి అడ్మిషన్ ఫీజుల పేరిట ఒక్కో విద్యార్థి నుండి నాలుగు వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. మొత్తంగా సుమారు ఆరు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని వెంటనే వాటిని విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫీజుల విషయంలో ఎవరైనా అడిగితే ప్రిన్సిపల్ స్వాతిప్రియ దురుసుగా ప్రవర్తిస్తుందని పేర్కొన్నారు. మొత్తం డీఈఓ ఆదేశాలతోనే అన్ని రకాల ఫీజులు వసూలు చేస్తున్నామని చెప్తుందని ఇది విద్యాశాఖ అధికారులకే తెలియాలని లేదా అధికారులు ఈ పాఠశాలతో కుమ్మక్కయ్యారా అని ప్రశ్నించారు. దురుసుగా ప్రవర్తిస్తున్న ప్రిన్సిపాల్ ని వెంటనే తొలగించాలని అన్నారు.  గవర్నింగ్ బాడీ ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా 50 వేల నుండి 60 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు.

సరైన సదుపాయాలు ఆటస్థలం, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ఏర్పాటు చేయలేదని అన్నారు.అర్హత కలిగిన టీచింగ్ సిబ్బంది కాకుండా ఇంటర్, డిగ్రీ పాస్ అయిన విద్యార్థులతో చదువు చెప్పిస్తున్నారని అన్నారు. అయినా విద్యాశాఖ అధికారులు ఇటువైపు చూడకపోవడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే పలు డిమాండ్లను పాఠశాల యాజమాన్యం పరిష్కరించాలని లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగి పాఠశాల గుర్తింపును రద్దు చేయాలని డిఇఓ కార్యాలయం ముట్టడికి పిలుపునిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బివిఎం జిల్లా అధ్యక్షులు జీవియం  విట్టల్ ,ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్,విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు కోత్మీర్కర్ వినయ్, పిడిఎస్యు జిల్లా కార్యదర్శి సురేష్, ఏబీవీపీ రాష్ట్ర నాయకులు చరణ్ , బీడీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నిమ్మ సురేష్ ,జివిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ నాయక్, విద్యార్థి సంఘాల నాయకులు నితిన్, అర్బస్ ,బుల్లెట్, సాయినాథ్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.