19-01-2026 05:01:55 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు.
మండలాల వారీగా పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు. ఇండ్లు, పింఛన్లు, భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తులను ఇటీవలి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా పూర్తి చేసినందుకు, ముఖ్యమంత్రి కార్యాలయం, అధికారులకు శుభాకాంక్షలు తెలియజేసిందని వివరించారు.
సీఎం పర్యటన విజయవంతం చేసినందుకు అధికారులకు, ఉద్యోగులకు, సిబ్బందికి కలెక్టర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీఓ రత్నకళ్యాణి, జెడ్పీ సీఈవో శంకర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.