కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్, అదనపు కలెక్టర్
మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) చంద్రయ్య శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో జాప్యం, రవాణా సమస్యలపై రైతుల ఆందోనలు చేయడంతో వారు నేరుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించారు. హాజీపూర్ మండలంలోని టీకానపల్లి, పెద్దంపేట, గొల్లపల్లి, దొనబండ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ సందర్శించి నిల్వ ఉంచిన ధాన్యం పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు గత నాలుగు రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోయిందని, లారీలు సమయానికి రాకపోవడంతో తూకం, తరలింపు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయిందని, అకాల వర్షాల భయంతో రాత్రింబవళ్లు ధాన్యంకు కాపలా కాస్తున్నామంటూ వాపోయారు.
కలెక్టర్ స్పందిస్తూ లారీల కొరత ఉన్నచోట రైతులు తమ సొంత ట్రాక్టర్ల ద్వారా సమీప రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించుకోవచ్చన్నారు. ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించిన రైతులకు అయ్యే రవాణా ఖర్చులను ప్రభుత్వమే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ భరోసా ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఎదురైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని రైతులకు సూచించారు. జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పడ్తనపల్లి, కర్ణమామిడి, హాజీపూర్ లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతులకు టార్ఫాలిన్ కవర్లు అందజేయాలని సెంటర్ నిర్వాహకులను ఆదేశించారు.
ధాన్యాన్ని పూర్తిగా ఆరబెట్టి, తాలు లేకుండా శుభ్రపరచి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ధాన్యం నాణ్యత బాగుంటే ఎలాంటి కోతలు లేకుండా మద్దతు ధర అందుతుందని స్పష్టం చేశారు. క్లీన్గా లేని ధాన్యానికి మిల్లుల వద్ద కోతలు విధించే అవకాశం ఉందని, దీనివల్ల ప్రభుత్వంపై అనవసర విమర్శలు వస్తాయని పేర్కొన్నారు. రైతు కష్టానికి విలువ దక్కేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని, కేంద్రాలకు వచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేయడమే లక్ష్యమని వారు స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట హాజీపూర్ మండల తహశీల్దార్ పుష్పలత, ఆర్‌ఐలు ప్రభు, మంగ, ఐకేపీ ఏపీఎం వెంకటేష్, ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు తదితరులున్నారు.






