22 June, 2026 | 2:29 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అంకిత్

07-04-2026 01:06 AM

భద్రాద్రి కొత్తగూడెం/ జూలూరు పాడు, ఏప్రిల్ 6, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అంకిత్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, విభాగాల పనితీరును సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, అందిస్తున్న వైద్య సేవల నాణ్యతపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇన్పేషెంట్ వార్డును సందర్శించిన కలెక్టర్, అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితి, అందుతున్న చికిత్స, వైద్య సిబ్బంది స్పందనపై వివరాలు తెలుసుకున్నారు.

రోగులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.  ఈ సందర్భంగా ఒక వృద్ధుడు తనకు ఎవరూ లేరని, ప్రమాదంలో కాలు కోల్పోయినట్లు తెలియజేస్తూ సహాయం కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆ వృద్ధుడి పూర్తి వివరాలు సేకరించి, కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించి అవసరమైన మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇన్పేషెంట్ విభాగంలో వడదెబ్బ కేసులు నమోదవుతున్నట్లు గుర్తించిన కలెక్టర్, వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు. ఆసుపత్రి లో ఔషధ నిల్వ గదిని సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్, స్టాక్ రిజిస్టర్లో నమోదైన ఔషధాల వివరాలు, వాస్తవ నిల్వలను సరిపోల్చి పరిశీలించారు. ఔషధాల నిల్వలు సరిపడా ఉన్నాయా లేదా అనే విషయంపై అధికారులను ప్రశ్నించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్న మందులు ఎంతో విలువైనవి అని, వాటిని పక్కదారి పట్టకుండా కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఉండాలని, బహిరంగ మార్కెట్లో విక్రయాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో ప్రతి సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని, నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో తాళ్లూరి రవి, మెడికల్ అధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.