వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధికి రూ. 14.44 కోట్లు మంజూరు
వరంగల్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): వరంగల్ నగరంలోని హనుమకొండలో చారిత్రాత్మక వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 14.44 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య తెలిపారు. చారిత్రాత్మక కాకతీయుల వైభవాన్ని అభివృద్ధి చేయడానికి, వేయి స్తంభాల ఆలయం, అదే ప్రాంగణంలోని కల్యాణ మండపం అభివృద్ధి, విస్తరణతో పాటు మిగిలిపోయిన పునరుద్ధరణ పనుల కోసం రూ.14.44 కోట్ల నిధులు మంజూరు చేయించడంలో ఎంపీ కడియం కావ్య కీలక పాత్ర పోషించారు.
ఈ నిధులతో కాకతీయుల కాలం నాటి శిల్ప వైభవాన్ని తిరిగి తీసుకురావడమే లక్ష్యంగా పనులు చేపట్టనున్నారు. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను పలుమార్లు కలిసి, వేయి స్తంభాల గుడి అభివృద్ధి అవసరాన్ని వివరిస్తూ తాను చేసిన నిరంతర ప్రయత్నాలతో నిధులు మంజూరయ్యాయని, నిధులు మంజూరు చేసిన కేంద్ర పురావస్తు ప్రాచీన కట్టడాల శాఖ అధికారులకు ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు.




