30-12-2025 02:47:34 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మౌనిక ఫర్టిలైజర్ షాప్‌ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాప్‌లోని ఎరువుల నిల్వలు, అమ్మకాలు, రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను కలెక్టర్ పరిశీలించారు. రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. అక్రమ నిల్వలు, అధిక ధరలకు విక్రయాలు, బిల్లులు ఇవ్వకుండా అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రతి రైతుకు అవసరమైన మేరకు ఎరువులు అందేలా చూడాలని, కృత్రిమ కొరత సృష్టించకుండా చర్యలు తీసుకోవాలని షాప్ నిర్వాహకులను ఆదేశించారు. అలాగే షాప్ ముందు ఎరువుల నిల్వల వివరాలు, ధరల పట్టిక, జిల్లా , రాష్ట్ర టోల్‌ఫ్రీ నంబర్లను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, తహసిల్దార్ రేణుక , AEO రాజలింగం, సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.