30-12-2025 02:43:32 PM
జిల్లా ఎస్పీ నితిక పంత్
డిసెంబర్ 31 సాయంత్రం నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లావ్యాప్తంగా నూతన సంవత్సరం వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ నితిక పంత్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 31 సాయంత్రం నుంచి నూతన సంవత్సరం సందర్భంగా జిల్లావ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలను సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ట్రిపుల్ రైడింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాష్ డ్రైవింగ్, స్పీడ్ రేసింగ్ వంటి చర్యలు చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. మైనర్లు వాహనాలు నడిపితే వారిపై మాత్రమే కాకుండా వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్లపై కేక్ కటింగ్ చేయడం, టపాకాయలు వెలిగించడం, బైక్ రేసింగ్‌లు నిర్వహించడం చట్టప్రకారం నేరమని, అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పేర్కొన్నారు.
నూతన సంవత్సరం సందర్భంగా డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు లేవని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా బహిరంగ ప్రోగ్రాములు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు నిర్వహించరాదని హెచ్చరించారు. సౌండ్ బాక్స్‌లు, మైక్ సిస్టంలతో కార్యక్రమాలు నిర్వహించాలంటే తప్పనిసరిగా పోలీస్ అనుమతులు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టిందని వెల్లడించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ లింకులు పంపి మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువతతో పాటు ప్రజలంతా పోలీసుల సూచనలు పాటిస్తూ, ఇతరులకు ఇబ్బంది కలగకుండా నూతన సంవత్సరం వేడుకలను బాధ్యతాయుతంగా జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.