30-12-2025 03:35:37 PM
- ఒకే దగ్గర భారీగా యూరియా డంపు
- జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): జిల్లాలో యూరియా ఎరువుల పంపిణీలో ఎలాంటి నిర్లక్ష్యం సహించేది లేదని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా సరఫరా జరగకపోతే సంబంధిత అధికారులు, డీలర్లపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మంగళవారం పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా నిల్వలు, విక్రయ విధానం, రికార్డుల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
యూరియా కొరత తలెత్తకుండా రైతులందరికీ సరఫరా చేయాలని, అవసరమైతే ఉదయం 6 గంటల నుంచే విక్రయాలు ప్రారంభించాలని ఆదేశించారు. రైతుల రద్దీ దృష్టిలో ఉంచుకుని సరఫరాలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలన్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎరువుల కొనుగోలు–విక్రయాలకు సంబంధించిన అన్ని రికార్డులు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. హోల్‌సేల్, రిటైల్ డీలర్లు, సహకార సంఘాల గోదాములలో రోజువారీ స్టాక్ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకొని గ్రామాల వారీగా అవసరానికి అనుగుణంగా యూరియా కేటాయింపు జరగాలని, అధిక ధరలకు విక్రయించే ప్రైవేట్ డీలర్లపై ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. ఇతర ఉత్పత్తులతో కలిపి యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్సిడీ యూరియాను పారిశ్రామిక అవసరాలకు మళ్లించే యూనిట్లపై తనిఖీలు నిర్వహించాలని, ఉత్పత్తి గణాంకాలు, బిల్లులు సరిపోల్చి వ్యత్యాసం ఉంటే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
రైతుల యూరియా కొనుగోళ్లపై రోజువారీ సమీక్ష జరగాలని, తరచుగా కొనుగోలు చేసే వారు, అధికంగా అమ్మే రిటైలర్లపై ప్రత్యేక పరిశీలన చేపట్టాలని తెలిపారు. పెద్దకొత్తపల్లి వ్యవసాయ కేంద్రంలో యూరియాను ఒకే చోట డంపు చేయడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్లక్ష్యంపై సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో జిల్లా కలెక్టర్ వెంట పెద్దకొత్తపల్లి తహసీల్దార్ శ్రీనివాసులు, మండల వ్యవసాయ అధికారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.