calender_icon.png 30 December, 2025 | 5:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి పోటీలలో ప్రతిభ చాటిన సుల్తానాబాద్ ఐపీఎస్ విద్యార్థులు

30-12-2025 03:32:13 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): ఇడాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్థాయి ఇగ్నైట్ గ్రాండ్ ఫైనల్ పోటీల్లో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ఇండియన్ పబ్లిక్ పాఠశాల విద్యార్థులు అసాధారణ ప్రతిభను కనబరిచి జాతీయ స్థాయిలో ఘన విజయాలు సాధించారు. ఇటీవల హైదరాబాదులో నిర్వహించిన ఇడాక్ ఇగ్నైట్ గ్రాండ్ ఫైనల్ పోటీల్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న పోటీదారులతో పోటీపడి, వివిధ కేటగిరీలలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చి బహుమతులు అందుకున్నారు.

ఫలితాల్లో ఎం. సంప్రీత్ సంగీత వాయిద్య విభాగంలో ప్రథమ బహుమతి, ఎం.సాత్విక గానం విభాగంలో ప్రథమ బహుమతి సాధించారు. అకాడెమిక్స్ విభాగంలో పి. కృశిక, ఆర్. వికాస్ ఇద్దరూ ప్రథమ బహుమతి గెలుచుకొని తమ ప్రతిభను నిరూపించారు.అదేవిధంగా డి.ఎస్. జతిన్ సంగీత వాయిద్య విభాగంలో ద్వితీయ బహుమతి, ఎం. సంచిత్ రోల్ ప్లే విభాగంలో ద్వితీయ బహుమతి సాధించారు. కె. శ్రీహిత శాస్త్రీయ నృత్య విభాగంలో తృతీయ బహుమతి పొందగా, ఐరా మాన్హా రోల్ ప్లే విభాగంలో అద్భుత ప్రదర్శనకు గాను ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ, ఉపాధ్యాయ బృందం విజేతలను అభినందించి, ఉపాధ్యాయుల మార్గనిర్దేశం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. ఇలాంటి విజయాలు ఇతర విద్యార్థులకు ప్రేరణగా నిలుస్తాయని వారు తెలిపారు. విజేతలకు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం,విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.