14 May, 2026 | 2:05 AM

రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు నిర్వహించాలి

14-05-2026 01:09 AM

వంగర ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్

భీమదేవరపల్లి, మే 13 (విజయక్రాంతి): గ్రామ సమైక్య సంఘాల ద్వారా నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలంలోని వంగర గ్రామంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. రవి వంగర గ్రామంలో ఇప్పటివరకు 3,500 క్వింటాళ్ల వరి ధాన్యాన్ని సేకరించి రైస్మిల్లులకు తరలించినట్లు కలెక్టర్ కు వివరించారు.  ఇంకా సుమారు 15 లారీల వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని వేగంగా మిల్లర్లకు పంపించి, రైతుల ఖాతాల్లో సంబంధిత మొత్తాలను జమ చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ మాణిక్యపురి వెంకటేశ్వర రైస్మిల్లును పరిశీలించారు.

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు చేరుతున్న ధాన్యాన్ని నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సేకరిస్తున్నారా అనే అంశాన్ని పరి శీలించారు. అలాగే ఎఫ్సీఐ గోదాములకు ధాన్యం తరలింపు విధానంపై సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రైతులకు ఎటువంటి నష్టం కలగ కుండా ధాన్యం సేకరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, మిల్లర్లు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సంబంధిత యాజమా న్యానికి సూచించారు.

అనంతరం ఎల్కతుర్తి విశాల సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మక్కల కొనుగోలు కేంద్రాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. మక్కల కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూడాలని, రైతుల కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శీను, జిల్లా సివిల్ సప్లై అధికారి వాజిద్ అలీ,  డిసిఓ సంజీవ రెడ్డి, డిసిసిబి సీఈఓ వజీర్ సుల్తాన్ అధికారులు పాల్గొన్నారు.