03-12-2025 01:18:24 AM
సన్మానించిన టీఎన్జీవో నాయకులు
కరీంనగర్, డిసెంబరు 2 (విజయ క్రాంతి): ఇటీవల హైదరాబాద్ అవాసా హోటల్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేళా సత్పతి ప్రతిష్ఠాత్మక భరత్ గౌరవ్ అవార్డును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అందుకున్నారు. ప్రజాసేవ, పరిపాలన, వినూత్న కార్యక్రమాల రూపక ల్పనలో చేసిన విశిష్ట కృషిని గుర్తిస్తూ ఈ అవార్డును ప్రదానం చేశారు.
మంగళవారం టీఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ను శాలువా, పుష్పగుచ్ఛాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ పేదలు, అనాధలు, బలహీన వర్గాల కోసం అమ్మ ప్రేమతో పనిచేస్తూ, కరీంనగర్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఒక అనాధ బాలికకు వివాహం నిర్వహించడం మానవత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచిందన్నారు.
ఆరోగ్య మహిళ పేరిట ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న ప్రత్యేక హెల్త్ సెషన్ల ద్వారా గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందజేస్తూ, మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది అనే భావనను జిల్లా కలెక్టర్ కార్యరూపంలో నిలబెట్టారని పేర్కొన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు నూతన ప్రోత్సాహం ఇస్తూ, మళ్లీ బడిబాట పట్టించే ప్రత్యేక మార్గదర్శక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాగి శ్రీనివాస్, కార్యదర్శి సర్దార్ ఆర్మీందర్ సింగ్, తిరుమల శారద, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కోట రామస్వామి, శంకర్, లవ్ కుమార్, కమలాకర్, కరుణాకర్ తదితరులుపాల్గొన్నారు.