4 March, 2026 | 11:02 PM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి

04-03-2026 09:49 PM

అధికారులతో సమీక్షలో కలెక్టర్ ఇలా త్రిపాఠి

6న జిల్లా ఇంచార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం

నిజామాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయిదు దశల్లో అమలు చేయనున్న 99 రోజుల యాక్షన్ ప్లాన్ గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్ క్షుణ్ణంగా వివరించారు. ఆయా శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. 

గ్రామ పంచాయతీ నుంచి జిల్లా స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ప్రజారోగ్యం, రోడ్డు భద్రతా చర్యలు, వివిధ వర్గాల వారి సంక్షేమం, కల్తీ కల్లు, మత్తు పదార్థాల నిరోధానికి చేపట్టాల్సిన పకడ్బందీ చర్యలు, రైతు సంక్షేమం.. వ్యవసాయం, విద్య, యువత.. క్రీడలు, మహిళల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లాలని అన్నారు. అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో నిర్దేశిత లక్ష్యాల సాధన కోసం కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

ముఖ్యంగా జిల్లాలో అన్ని ఆసుపత్రులు పి.హెచ్.సీ సెంటర్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మాతా శిశు మరణాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. జిల్లా జనరల్ ఆసుపత్రి పనితీరులో స్పష్టమైన మార్పు రావాల్సిందేనని కలెక్టర్ స్పష్టం చేశారు ప్రజా ఆరోగ్యానికి ఎనలేని ప్రాధాన్యతనిస్తూ కల్తీ ఆహార పదార్థాలు నిరోధానికి ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ అధికారులు సమన్వయంతో కృషి చేయాలని అన్నారు. 14 - 15 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన బాలికలకు హెచ్.పీ.వీ వ్యాక్సిన్ తప్పక అందేలా చూడాలన్నారు. సోలార్ విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు. కాగా, మార్చి 6న జిల్లా ఇంచార్జి మంత్రి అధ్యక్షతన ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికపై  సన్నాహక సమావేశం ఉంటుందని, అన్ని శాఖల అధికారులు సమగ్ర వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, దిలీప్ కుమార్, డీ.ఆర్.డీ.ఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.