మైనారిటీ గురుకులాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచన
విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్
మేడ్చల్, మార్చి 25 (విజయక్రాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాగారంలోని మైనారిటీ మహిళల గురుకుల పాఠశాల, కాలేజీని కలెక్టర్ మను చౌదరి బుధవారం తనిఖీ చేశారు. గురుకులంలోని సదుపాయాలను, ఆహారాన్ని పరిశీలించారు. విద్యార్థులతోపాటు భోజనం చేశారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమకు ఆడుకోవడానికి ఫుట్బాల్, చెస్ కావాలని విద్యార్థులు కోరారు.
కలెక్టర్ స్పందిస్తూ ఆట వస్తువులు, ఇతర అవసరాలకు కావలసిన వి ప్రతిపాదనలు పంపాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు మీకు ఇష్టమైన స్పోరట్స్, గేమ్స్, మీ అభిరుచులలో కూడా మీ ప్రతిభను బయటపెట్టి అందులో కూడా మీరు రాణించేలా మీకు అవసరమైన శిక్షణను అందించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని అన్నారు. మీ పై మీకు ఆత్మవిశ్వాసం ఉండాలని, బిడియాన్ని వదిలి మీకు తెలిసిన విషయాన్ని నలుగురిలో మాట్లాడగలగాలని అప్పుడు మీ పై మీకు నమ్మకం కలుగుతుందన్నారు.
చదువుతో పాటు మారుతున్న టెక్నాలజీని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకొని ఎక్కువ శ్రమ పడకుండా స్మార్ట్ వర్క్ చేయాలని తద్వారా టైమ్ సేవ్ అవుతుందన్నారు. ప్రస్తుతం చాట్ జిపిటి, జెమిని, పెర్ప్లెక్సిటి వంటి ఎఐ టూల్స్ ఎక్కువగా వినియోగించడం జరుగుతుందన్నారు. ఎఐ టూల్స్ ద్వారా పెయింటింగ్, వెబ్ డిజైనింగ్, ప్రొగ్రామింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ చాలా అభివృద్ధి చెందిందన్నారు.
మంచి అలవాట్లను అలవర్చుకోండి, అవి మీ భవిష్యత్తు ప్రయత్నాలలో ఎల్లప్పుడూ తోడ్పడతాయని, ఆత్మవిశ్వాసంతో ఉండాలంటే మీకు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలని, సబ్జెక్ట్ అంటే కేవలం అకాడమిక్స్ మాత్రమే కాదని, ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆ అంశంపై పూర్తి అవగాహాన కలిగి ఉండాలన్నారు. ఇంగ్లీషు బాగా నేర్చుకొని మీరు స్టేజ్ ఫియర్ తొలగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధికారి కాంతమ్మ, కీసర ఎంఆర్‌ఓయాదగిరిరెడ్డి, ప్రిన్సిపల్ స్వప్న, స్కూల్ టీచర్లు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.




