calender_icon.png 12 December, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

12-12-2025 12:21:27 AM

సిద్దిపేట కలెక్టరేట్, డిసెంబర్ 11: సిద్దిపేట జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రశాంతంగా కొన సాగుతున్న నేపథ్యంలో, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి గజ్వేల్, రాయపోల్ మండలాల కీలక పోలింగ్ స్టేషన్లలో ఓటింగ్ సరళిని పరిశీలించారు. రాయపోల్ మండలంలోని మంతూరు, అనాజిపూర్, గజ్వేల్ మండలంలోని జాలిగామ, సింగాటం, శ్రీగిరిపల్లి గ్రామాల్లోని పోలింగ్ స్టేషన్లను కలెక్టర్ సందర్శించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మధ్యాహ్నం 1 గంట వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లకే అనుమతి ఇవ్వాలని, కొత్తగా వచ్చే వారికి అనుమతి ఇవ్వకూడదని సిబ్బందికి ఆదేశించారు. ఓటింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులకు లాక్, సీల్ ప్రక్రియను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులను సూచించారు. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని ఆదేశించారు.

కౌంటింగ్ సెంటర్లలో ఏజెంట్లు, పోలింగ్ సిబ్బందికి మొబైల్ ఫోన్లు పూర్తిగా నిషేధం అని తెలిపారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఫలితాల ప్రకటన పై అధికారుల అనుమతి తర్వాత మాత్రమే జరగాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో గజ్వేల్, ములుగు, మర్కుక్ జగదేవ్పూర్, వర్గల్, రాయపోల్, దౌల్తాబాద్ మండలాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

జిల్లాలోని 7 మండలాల్లో 88.05 % పోలింగ్ జరిగిందని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సుమారు 3 వేల మంది సిబ్బంది ఎన్నికల విధులలో పాల్గొంటున్నారని, పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.