డీఈవోపై కలెక్టర్ కన్నెర్ర
ఏడీ, డిప్యూటీ డీఈవోపైనా చర్యలు
విధుల పట్ల నిర్లక్ష్యంపై షోకాజ్ నోటీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మే21(విజయక్రాంతి): విధుల పట్ల నిర్లక్ష్యం వహించారనే కారణంతో హైదరాబాద్ జిల్లావిద్యాశాఖాధికారి(డీఈవో)పై కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కన్నెర్రజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారని డీఈవో సహా అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ), డిప్యూటీ డీఈవోకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం, విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ కుట్టించే పనులలో పురోగతి లేకపోవడం, విధుల పట్ల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్ డీఈవో కే.రోహిణి, ఇన్‌చార్జి డీఈవో,ఏడీ బి. శ్రీనివాస్, బహదూర్‌పుర డిప్యూటీ డీఈవోపై కలెక్టర్ చర్యలకు ఉపక్రమించారు. వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే, అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధిప ఇటీవల జరిగిన సమీక్షకు డీఈవో హాజరు కాకపోవడం వల్లే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రైవేటుకంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలు: కలెక్టర్
ప్రైవేటు కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి పనులను డీఈవో రోహిణి, టీజీఈడబ్ల్యూఐడీ ఈఈ షఫీమియా, అమ్మ పాఠశాలల కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. సైఫాబాద్ మాదన్నపేట ఎరుకల బస్తీ హైస్కూల్, మలక్‌పేట్ అంధుల బాలికల ఉన్నత పాఠశాల, కాచిగూడ తులసీరామ్‌నగర్ ప్రాథమిక పాఠశాలను సందర్శించి పనులపై ఆరా తీశారు.
మలక్‌పేట అంధుల పాఠశాలలో శిథిలావస్థ భవనాన్ని తొలగించాలని మున్సిపల్ అధికారులను కోరారు. పాఠశాలల్లో ఫ్యాన్లు, ట్యూబ్స్, కంప్యూటర్ రూమ్, టాయిలెట్స్‌ను పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆర్.లక్ష్మి, అంజిరెడ్డి, అస్రాఫాతిమా, రాజిరెడ్డి, ఆదర్శ పాఠశాలల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.






