శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలకం
రాచకొండ సీపీ తరుణ్‌జోషి వెల్లడి
సిబ్బందికి లాప్‌ట్యాప్‌లు, ట్యాబ్‌లు పంపిణీ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే21(విజయక్రాంతి): శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత కీలకమని, పోలీసులు ఎప్పటికప్పుడు ఆధునిక పరిజ్ఞానం అందిపుచ్చుకుని మెరుగైన, సత్వర సేవలు అందించాలని రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్‌జోషి పేర్కొన్నారు. నేరేడ్‌మెట్ కమిషనరేట్ పరిధిలో రూ.1.33కోట్ల విలువైన 170ట్యాబ్‌లు, 18 లాప్‌టాప్‌లు, 80 కంప్యూటర్లను పంపిణీ చేశారు. ఎస్‌హెచ్‌వోలు, బ్లూకోల్ట్స్ సిబ్బందికి వీటిని అందజేశారు. ఈ సందర్భంగా సీపీ తరుణ్‌జోషి మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు ఆధునిక సాంకేతికత పోలీసులకు అవసరమని అన్నారు.
నూతన న్యాయ చట్టాలపై అవగాహన
జూలై 1నుంచి అమలులోకి రానున్న నూతన న్యాయ చట్టాలపై రాచకొండ కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులు, సిబ్బందికి అవగాహన కల్పించనున్నట్లు సీపీ తరుణ్‌జోషి తెలిపారు. ఈ మేరకు అందరికీ కొత్త చట్టాల ప్రతులను అందించినట్లు పేర్కొన్నారు. త్వరలో శిక్షణ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ ఇందిర, డీసీపీ క్రైమ్ అరవింద్‌బాబు, సైబర్‌క్రైమ్ డీసీపీ చంద్రమోహన్, అదనపు డీసీపీ నరసింహారెడ్డి, ఏసీపీ ఐటీసెల్ నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






