రేవ్ పార్టీలో నటి హేమ.. ఆమెతో పాటు మరో 100 మంది
కర్నాటక: బెంగళూరు శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో నిర్వహించిన రేవ్ పార్టీ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. తెలుగు నటులు పలువురు అందులో పాల్గొన్నట్టు రూమర్స్ దుమారం రేపాయి. ఈ రేవ్ పార్టీకి సంబంధించిన అంశంపై బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ బి దయానంద్ కీలక విషయాలు వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... సన్ సెట్ టు సన్‌రైజ్ పేరుతో నిర్వహించిన రేవ్ పార్టీలో 101 మంది పాల్గొన్నారని, వారిలో టాలీవుడ్ నటి హేమ కూడా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌కు చెందిన వాసు అనే వ్యక్తి పుట్టినరోజు సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు గుర్తించామని, పార్టీలో ఎక్కువ మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నట్లు తెలిపారు. రేవ్ పార్టీపై సిసిబి పోలీసులు దాడి చేయగా డ్రగ్స్ పట్టుబడ్డాయని తెలిపారు. పార్టీలో పాల్గొన్న అందరి రక్త నమూనాలు సేకరించామని.. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారో రిపోర్ట్స్ వచ్చాక తెలుస్తుందని పేర్కొన్నారు.
కాగా రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సమయంలో నిర్వాహకులు తప్పించుకునే ప్రయత్నం చేశారని, డ్రగ్స్ దొరకకుండా స్విమ్మింగ్ పూల్స్, ప్రహరీ వెలుపల పడేశారని, డాగ్ స్కాడ్ ద్వారా డ్రగ్స్‌ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం ఐదుగురిపై కేసు నమోదు చేశామని.. రేవ్ పార్టీకి సంబంధించి ఇంకా విచారణ జరుగుతోందని సిపి ప్రకటించారు. ఈ పార్టీలో నటి హేమ తాను లేనని తెలుపుతూ.. సోమవారం ఓ వీడియో విడుదల చేయగా.. ఆ వీడియో ఎక్కడి నుంచి తీశారో విచారణ జరుపుతున్నామని, రేవ్ పార్టీలో మొత్తం 30 మంది మహిళలు పాల్గొనగా.. అందులో 25 మంది యువతులు ఉన్నారని, ఇక ఈ పార్టీలో 45 గ్రాములు ఎండిఎంఎ, కొకైన్‌తో పాటు 18 లగ్జరీ కార్లను సీజ్ కమిషనర్ వెల్లడించారు.






