పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన
నర్సాపూర్, మే 5 : ఈ నెల 13న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంలపై సీరియల్ నంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు పక్కాగా ఉండేలా చూసుకోవాలన్నారు. కమిషనింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు. అలాగే స్ట్రాంగ్ రూం నిర్వహణ వివరాలను ఏఆర్‌ఓలను అడిగి తెలుసుకన్నారు.
బ్యాలెట్ ఓటింగ్ పరిశీలన
పార్లమెంట్ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా ఆదివారం నర్సాపూర్ ఆర్డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సరళిని పరిశీలించారు. ఓటు వేయడానికి వచ్చే ప్రతి పౌరునికి అధికారులు సహాయ సహకారాలు అందించాలన్నారు. కలెక్టర్ వెంట ఎన్నికల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.




