సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో గ్రామసభ అభివృద్ధిపై కలెక్టర్ సమీక్ష
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్దే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(District Collector Badawat Santosh) గురువారం గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు పట్ల విఫలమైన అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్, మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ప్రతి అర్హుడు సంక్షేమ పథకాల లబ్ధి పొందాల్సిందేనని, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను సమయానికి అందించాలని అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల పరిశీలన వేగంగా పూర్తి చేసి, అర్హులైన వారికి తక్షణమే లబ్ధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామస్తులు తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి నేరుగా తీసుకురాగా, వాటి పరిష్కారానికి తక్షణమే సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవ సహాయం, డిఆర్డిఏ చిన్న ఓబులేసు, ఆర్డీవో జనార్దన్ రెడ్డి, డిపిఓ శ్రీరాములు, ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్ సింగ్ తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






