5 August, 2026 | 10:34 PM

ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి

23-08-2024 02:52 PM

సీజనల్ వ్యాధులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

నేరెళ్ల పీహెచ్ సీ ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా

తంగళ్లపల్లి కేజీబీవీ సందర్శన, విద్యార్థినిలకు పాఠాలు బోధించిన జిల్లా కలెక్టర్

రాజన్న సిరిసిల్ల: ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవాలని వైదులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( పీహెచ్ సీ) ను కలెక్టర్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ల్యాబ్, ఫార్మసీ, వ్యాక్సిన్లు, ఓపీ, కాన్పుల రిజిస్టర్, ఫ్రిడ్జ్ లో వ్యాక్సిన్ తనిఖీ చేసి, వివరాలు తెలుసుకున్నారు.  ఓ.పీ ఎంత మంది వచ్చారు..? పీహెచ్ సీలో ఈ నెలలో ఇప్పటిదాకా ప్రసవాలు ఎన్ని చేశారు..? కుక్క కాటు, డెంగ్యూ టెస్ట్ కిట్ల పై ఆరా తీయగా, ఈ రోజు 15 మంది ఓపీ రాగా, వారిలో ఇద్దరికీ రక్త పరీక్షలు చేశామని, ఈ నెలలో 19 కాన్పుల లక్ష్యం కాగా, 10 చేశామని, అన్ని టెస్ట్ కిట్లు, వ్యాక్సిన్ లు ఉన్నాయని కలెక్టర్ దృష్టికి డాక్టర్ రేఖ తీసుకెళ్లారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. ప్రభుత్వ వైద్య సేవలపై అవగాహన కల్పించాలని, ఇక్కడే అన్ని పరీక్షలు, వైద్యం అందించాలని సూచించారు.

హాస్పిటల్, ఆవరణలో స్వచ్చత, పరిశుభ్రత పాటించాలని పేర్కొన్నారు. సీజనల్ వ్యాధులు, డెంగ్యూ, మలేరియా పై ప్రత్యేక దృష్టి పెట్టి టెస్ట్లు, మెడిసిన్ అందించాలని సూచించారు. హాస్పిటల్ కు కావాల్సిన కిట్లు, మందులు ఏమైనా అవసరం ఉంటే సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఇక్కడ పీహెచ్ సీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తంగళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  విద్యాలయం ఆవరణ, వంట సామాగ్రి స్టోర్ రూం, కిచెన్ పరిశీలించారు. మెనూ ప్రకారం ఈ రోజు ఏ ఏ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారో చూశారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులతో పాఠ్యాంశాలు చదివించి, పాఠాలు భోదించారు. మ్యాథ్స్, ఇంగ్లీష్, బయో సైన్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వేశారు. టీచర్లు పాఠాలు బోధిస్తున్నప్పుడే విద్యార్థులు నోట్స్ రాసుకోవాలని సూచించారు. ఇక్కడ పీజీ సీ ఆర్ టీ సంతోషిణి, ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.