calender_icon.png 7 February, 2026 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెనూ ప్రకారం రుచికరమైన ఆహారం అందించాలి

07-02-2026 05:31:05 PM

కుమ్రంభీం అసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం పోషక విలువలు కలిగిన రుచికరమైన ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదేశించారు. శనివారం జిల్లాలోని రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా వంటశాల, తరగతి గదులు, విద్యార్థుల హాజరు పట్టికలు, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. మధ్యాహ్న భోజనంలో మెనూ ప్రకారం పోషకాహారం అందించాలని, భోజనశాలలు, తరగతి గదులు, పాఠశాల పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. పదవ తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేసి ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు శుద్ధమైన త్రాగునీటిని అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అనంతరం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఉపాధి హామీ కార్యాలయాన్ని సందర్శించి కూలీలకు కల్పిస్తున్న పని దినాల రిజిస్టర్లను పరిశీలించి, అర్హత గల ప్రతి కూలీకి తగిన పని దినాలు కల్పించాలని తెలిపారు. మండలంలోని లక్ష్మీపూర్ గ్రామపంచాయతీని సందర్శించి నర్సరీ నిర్వహణను పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని, సకాలంలో నీరు అందించి మొక్కలను సంరక్షించాలని నిర్వాహకులకు సూచించారు.

అదేవిధంగా మండలంలోని పులికుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉండాలని సూచించారు. గర్భిణులు, బాలింతలకు సమయానుసారంగా పరీక్షలు నిర్వహించి పోషకాహారం, అవసరమైన మందులు అందించాలని తెలిపారు.

తదనంతరం తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. భూ భారతి రికార్డులు, వివిధ ధ్రువపత్రాలు, కళ్యాణ లక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం కొండపల్లి గ్రామపంచాయతీని సందర్శించి అక్కడి నర్సరీ నిర్వహణను పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధ్యాయులు, వైద్యులు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.