calender_icon.png 23 November, 2025 | 5:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోధనపై కలెక్టర్ మార్క్ !

02-11-2025 12:00:00 AM

బుధవారం బోధన.. శుక్రవారం మహిళల ఆరోగ్య సంరక్షణపై సభలు

  1. తల్లి.. బోధకురాలు.. ఆరోగ్య సంరక్షురాలిగా కార్యక్రమాలు 

ప్రత్యేకతను చాటుకుంటున్న కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పాలనలో మార్క్ చూపిస్తూనే మరో వైపు ప్రత్యేకతను చాటుకుంటున్నారు. విధి నిర్వహణలో నిత్యం తలమునకలై ఉంటూనే తాను ఎంచుకున్న ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో నైపుణ్యత పెంపొందించడంతో పాటు మెరుగైన విద్యను అందించే దిశగా ‘బుధవారం బోధన’.. ఆరోగ్య మహిళ కార్యక్రమంతో మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా శుక్రవారం సభలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 

కలెక్టర్ సత్పతి  బుధవారం బోధన కార్యక్రమంలో పాల్గొంటూ విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేయడం, బోధకురాలిగా మారి పాఠాలు చెప్పడం, విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ పాటిస్తున్నారా లేదా చూడడం, వంటశాలను సందర్శించి నిత్యం తనిఖీలు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారం అండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరో కార్యక్రమం శుక్రవారం సభలు నిర్వహిస్తూ ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

మహిళల ఆరోగ్య రక్షణే ధ్యేయంగా ముందుకెళ్తూ, వారికి  ఉపాధి అవకాశాలు పెంపొందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ఈవీ ఆటో వాహనాల డ్రైవింగ్లో శిక్షణ ఇప్పించి వాహనాలు సైతం అందించారు.  ఈ రెండు కార్యక్రమాలతోపాటు అంగన్వాడీ కేంద్రాలను తీర్చిదిద్దుతూ శభాష్ అనిపించుకుంటున్నా రు. 2022లో భువనగిరి కలెక్టర్ గా పనిచేసినప్పుడు తన రెండున్నరేళ్ల కుమారున్ని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించి ఆదర్శంగా నిలిచారు. 2023లో కరీంనగర్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి తాను ఎంచుకున్న ప్రత్యేక కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతున్నారు.

ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలగించేలా..

సహజంగా ఉన్నతాధికారులు, ఉన్నతవర్గాలు ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల వైపు చూస్తుంటారు. కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిత్యం తనిఖీ చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ నిర్వహించే వైద్య శిబిరాలను సందర్శిస్తూ స్వయంగా వైద్య పరీక్షలు చేయించు కుంటూ ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ముందుకెళ్తున్నారు.

శుక్రవారం సభ ద్వారా ఆరోగ్య సూత్రాలు బోధిస్తూ, పిల్లలు, తల్లుల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నారు. మహిళలు, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపే కలెక్టర్ గ్రామైక్య సంఘాల సభ్యులకు అవగాహన కల్పిస్తూ ఆరోగ్య మహిళా కార్యక్రమాలను రెండు సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కలెక్టర్ అందిస్తున్న సేవలను యూనిసెఫ్ గుర్తించడం చెప్పుకోదగ్గ అంశం.

అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి భ్రూణ హత్యలు, బాలికల విద్య, సాధికారతలపై అవగాహన పెంచే ఉద్దేశంతో ఒక ప్రత్యేక పాట ఆలపించారు. ’ఓ చిన్ని పిచ్చుక, చిన్నారి పిచ్చుక’, దీన్ని హిందీ రచయిత స్వానంద్ కిర్కిరే రాయగా తెలుగులో నంది శ్రీనివాస్ అనువదించగా కలెక్టర్ సత్పతి స్వయంగా ఆలపించారు.  

-అభివృద్ధిపై చెరగని ముద్ర

కలెక్టర్ పమేలా సత్పతి వరంగల్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. 2019 డిసెంబర్‌లో వరంగల్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సత్పతి నగరాభివృద్ధిపై చెరగని ముద్ర వేశారు. 2015లో ఐఏఎస్ పూర్తి చేసుకున్న పమేలా భద్రాచలం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. అక్కడ ఆమె 19 నెలలు పనిచేసి ౩నెలలపాటు భద్రాచలం ఈఓగా కూడా కొనసాగడం గమనార్హం. ఆ తర్వాత 11 నెలలు భూసేకరణ శాఖలో పనిచేశా రు. అనంతరం యాదాద్రి  కలెక్టర్‌గా నియమితులై 2023లో కరీంనగర్ కలెక్టర్‌గా చేరారు.

కుటుంబ నేపథ్యం

పమేలా సత్పతి ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని సునాబెడాలో పుట్టి పెరిగారు. ఆమె డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫీసర్ ఆర్కే సత్పతి కూతురు. తన తల్లి నుంచి స్ఫూర్తిని పొంది ఉన్నత చదువులు చదవాలని నిర్ణయించుకున్నారు. వృత్తిరీత్యా డాక్టర్‌గా ఉంటూ ఉమ్మడి కుటుంబంలో జీవిస్తున్న దీపాంకర్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు.  కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఆమె ఇన్ఫోసిస్ లో మొదటి క్యాంపస్ ప్లేస్మెంట్ సాధించింది.  

 బల్మూరి విజయ సింహారావు, కరీంనగర్, విజయక్రాంతి

-కఠినమైన పాఠ్యాంశం నేర్పించేందుకే ..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కఠినమైన పాఠ్యాంశాలు నేర్పించేందుకు బుధవారం బోధన కార్యక్రమాన్ని ప్రారంభించాం. జిల్లావ్యాప్తంగా ప్రతి బుధవారం అన్ని పాఠశాలల్లో బుధవారం బోధన నిర్వహిస్తున్నాం. విద్యార్థులచేత పాఠాలు చదివించడం, స్పష్టంగా, అర్థవంతంగా చదివేందుకు మెళకువలు నేర్పడం, ప్రతి విద్యార్థి నోట్ బుక్‌లో రాతను మెరుగుపర్చడం, బుధవారం బోధనలో ఏదైనా సబ్జెక్టులోని కఠిన పాఠాన్ని ఎంచుకుని చదివిస్తున్నాం. పాఠశాల సందర్శనలో విద్యార్థులకు పౌష్టికాహారం అందించే అంశంపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నాం. - జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి