4 March, 2026 | 12:38 PM

బాచుపల్లి భారీ అగ్నిప్రమాదం

04-03-2026 11:06 AM

హైదరాబాద్: బాచుపల్లి భారీ అగ్నిప్రమాదం(Bachupally Fire Accident) సంభవించింది. రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణంలో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది పది ఫైర్ ఇంజిన్లతో ఐదు గంటలకు పైగా కష్టపడాల్సి వచ్చింది. నిరంతర ప్రయత్నాల తర్వాత బుధవారం తెల్లవారుజామున మంటలను అదుపులోకి తెచ్చారు. మంటలు ఎగిసిపడడంతో స్థానికంగా భయాందోళనలు నెలకొన్నాయి.

మొదట రోడ్డు పక్కన ఉన్న ఫర్నిచర్ దుకాణంలో(Furniture store) మంటలు చెలరేగి, నిమిషాల వ్యవధిలోనే దాదాపు 50 దుకాణాలకు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది దానిని అదుపు చేసేలోపే మంటలు వేగంగా పెరిగి, సమీపంలోని దుకాణాలకు వ్యాపించాయి. దుకాణాల్లో మండే పదార్థాలు నిల్వ ఉండటంతో, అగ్నిమాపక సిబ్బంది పని కష్టమైంది. మంగళవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అనంతరం ఫుట్‌పాత్‌పై ఉన్న షాపుల్లో ఒక్కొక్కటిగా మంటలు అంటుకున్నాయని బాధితులు తెలిపారు. మంటల్లో రూ. కోటి విలువైన ఫర్నిచర్ దగ్ధమైదంటూ, సర్వం కోల్పోయామంటూ చిరు వ్యాపారులు కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.