22 April, 2026 | 4:36 AM

బాచుపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం… బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్

04-03-2026 01:43 PM

హైదరాబాద్: బాచుపల్లిలో(Bachupally Fire Accident) జరిగిన అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender) పరిశీలించి, బాధితులతో మాట్లాడి సంఘటనకు గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడుతూ.. ప్రగతి నగర్, బాచుపల్లి రోడ్డులో పల్నాడు, నరసరావు పేట, గుంటూరు నుండి 20 ఏళ్ల క్రితం బతుకుతెరువు కోసం వచ్చి ఫర్నిచర్ అమ్ముకుంటున్నారు.

ఇక్కడే షాపు నడుపుతూ, నివాసం ఉంటున్నారని తెలిపారు. కరెంటు లైన్ తెగిపడి అగ్ని ప్రమాదం జరగడంతో 20 ఏళ్ల నుండి సంపాదించుకున్న సర్వం కళ్ళముందే కాలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన హృదయవిదారకంగా ఉందన్న ఆయన చిరు వ్యాపారులు కట్టుబట్టలతో మిగిలిపోయారని తెలిపారు. మానవతా కోణంలో ప్రభుత్వం స్పందించాలని కోరారు. కలెక్టర్ తో మాట్లాడి తన వంతు సాయం చేస్తామని ఈటల మళ్ళీ వ్యాపారం చేసుకోవడానికి కావలసిన శక్తి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.

హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల కరెంటు తీగలు వేలాడబడుతున్నాయని ఆరోపించారు. బిల్డింగ్ మీద నిలబడితే చేతికి అందేలా ఉన్నాయని, చాలా మంది పెద్దలు, పిల్లలు కరెంట్ షాక్ ప్రమాదాలు వల్ల చనిపోతున్నారని పేర్కొన్నారు. అండర్ గ్రౌండ్ కేబుల్ సిస్టమ్ కేవలం మాటలకే పరిమితం అవుతుందని ఆరోపించారు. ట్రాన్స్ఫార్మర్ చుట్టూ కూడా సరైన భద్రత లేదని మండిపడిన ఈటల రాజేందర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద, మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.


ఇవీ చదవండి:

తిరుమల లడ్డూ నెయ్యి వివాదం: ఏపీ మండలిలో వైఎస్సార్‌సీపీ–టీడీపీ వాగ్వాదం

ఢిల్లీకి సీఎం రేవంత్.. రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కసరత్తు

బాచుపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం… బాధితులను పరామర్శించిన ఈటల రాజేందర్