19-10-2025 12:48:41 AM
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరాన ఆత్మీయత, ఆధ్యాత్మికత, ఆహారం మూడు కలిసిన ఊరు. మంథని బ్రాహ్మణ వంటల్లో శాకాహారం ప్రధానమైనది. పప్పులు, కూరగాయలు, పెరుగు, నెయ్యి, కారం పసుపు సమతుల్యంగా ఉండడం ప్రత్యేకత. ముద్దపప్పు, సన్నపిండి పప్పు, పొంగలి, ఆవకాయ పప్పు, మజ్జిగ పులుసు, బెల్లం చారు, వేపుడు బూడిదగుమ్మడి, పచ్చిమిర్చి పెరుగు పచ్చడి వంటలు పెరుగాంచాయి. బొబ్బట్లూ, పూరణం పొలీలు ఇవన్నీ అక్కడి ఇంటింటా ప్రసిద్ధి పొందినవి.
పండుగల ప్రత్యేకం
ఉగాది, శ్రీరామనవమి, వడబియారసి, పితృపక్షం లాంటి వేడుకల్లో ఒక్కో రోజుకి వేర్వేరు మెనూలు సిద్ధం చేస్తారు. ఉగాది రోజున చింతపండు పచ్చడి, మామిడి చారు, శ్రీరామనవమి రోజున పానకం, పులిహోర, వడపప్పు, శ్రావణమాసంలో పాయసం, అరటిపండు, నెయ్యి బియ్యం తప్పనిసరిగా వుంటాయి.
స్పెషల్ శాకాహార శాస్త్రం
వంట చేసే ముందు గంగాజలంతో మంత్రించి, గోమయంతో వంటగదిని శుభ్రపరచడం, దేవునికి మొదట నైవేద్యం సమర్పించడం ఇవన్నీ మంథని బ్రాహ్మణ వంటల్లో ఆధ్యాత్మికతను తెలియజేస్తాయి. వంటలో రుచికి మించి ఆచారానికి ప్రాధాన్యం ఉంటుంది.
శుచిగా ఉండాలి, వంటలో లసుణం, ఉల్లిపాయ వాడరు. పాత తరం పెద్దమ్మలు చెబుతుంటారు వంట అంటే కేవలం పొట్ట నింపడం కాదు, అది సేవ. ఆ భావనతోనే మంథని బ్రాహ్మణ వంటకాలు ఇప్పటికీ మన్నన పొందుతున్నాయి. ఇప్పుడు కొత్త తరాలు సాంప్రదాయ వంటలను ఆధునిక మేళవింపుతో రుచుల వారసత్వంగా కొనసాగిస్తున్నాయి.
బల్మూరి విజయసింహారావు, కరీంనగర్, విజయక్రాంతి