6 April, 2026 | 6:36 PM

రండి బాబూ.. రండి

15-10-2025 01:28 AM

- మద్యం షాపులకు ఆశించిన మేర రాని దరఖాస్తులు 

-టెండర్ల సంఖ్య పెంచేందుకు ఆపసోపాలు పడుతున్న ఎక్సుజ్ అధికారులు 

- ఎక్సుజ్ టెండర్లపై రియల్ ప్రభావం 

- చివరి నాలుగు రోజుల పైనే ఆశలు 

- ఇప్పటివరకు 145 దరఖాస్తులు

 వికారాబాద్, అక్టోబర్ 14: రండి బాబు.... రండి మద్యం షాపులకు టెండర్లు వేయండి..... మీ అదృష్టాన్ని పరిక్షించు కోడంటూ ఎక్సుజ్ శాఖ అధికారులు అంతర్గతంగా వ్యాపారులను ప్రాదేయ పడుతున్నారు.  పోయిన దఫా ఈ మద్యం షాపులో ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ షాపులపై టెండర్లు వేయండంటూ సలహాలు, సూచనలు చేస్తున్నారు.  అయినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ కూడా ఆశించిన మేర మద్యం షాపులకు టెండర్లు రావడం లేదు.

పాత వ్యాపారులు చివరి వరకు వేచి చూసే ధోరణి అవలంబిస్తుండగా, కొత్తవారు టెండర్ వేయాలా....? వద్ద అనే డైలమాలో ఉన్నారు. రాష్ర్ట ప్రభుత్వం కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చిన నేపథ్యంలో దరఖాస్తు ఫీజు భారీగా పెంచిన విషయం తెలిసిందే. గతంలో రూ. 2  లక్షలు గా ఉన్న ఫీజును ఏకంగా రూ. 3 లక్షలకు పెంచడం వ్యాపారులను పునరాలోచనలో పడేస్తుంది.  అంతేకాకుండా 2023 -24 సంవత్సరంలో టెండర్లు దక్కించుకున్న చాలామంది వ్యాపారులు  నష్టాల పాలయ్యారనే ప్రచారం ఉంది.  అంతేకాకుండా ఎక్సుజ్ అధికారుల వేధింపులు సైతం అధికమవుతున్నాయని విమర్శలు ఉన్నాయి.  ఇలా మద్యం వ్యాపారంలో లాభనష్టాలు బెరీజు  వేసుకుంటున్న వ్యాపారులు టెండర్లు వేసే విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నారు.

ఆసక్తి చూపని కొత్తవారు

మద్యం టెండర్లు వేసేందుకు కొత్త వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. దీంతో మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా మద్యం వ్యాపారం సాగే అవకాశం లేకపోలేదు.  అయినా టెండర్లు వేసేందుకు గత ఏడాది మాదిరిగా ముందుకు రావడం లేదు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 59 మద్యం షాపులకు 2023 -24 లో ఏకంగా 2500 దరఖాస్తులు వచ్చాయి.  దీంతో ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుంది. ఈ ఏడాది వ్యాపారుల్లో ఆ ఆసక్తి ఎక్కడ కనిపించడం లేదు. 2023లో నిర్వహించిన టెండర్లకు రెగ్యులర్ వ్యాపారులే కాకుండా చేతిలో కొంత డబ్బు ఉన్న వాళ్లంతా సిండికేట్ గా ఏర్పడడంతో పాటు ఉద్యోగులు సైతం వారి కుటుంబీకులు, మహిళల పేరు మీద టెండర్లు వేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. టెండర్ల ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు కావస్తున్న దరఖాస్తు ఇంకా వందల్లో నే ఉండటం గమనరం. 

మద్యం టెండర్లపై రియల్ ప్రభావం

గత రెండు సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోవడం మద్యం టెండర్లపై తీవ్ర ప్రభావం చూపుతోందనే ప్రచారం ఉంది. 2023లో టెండర్లు వేసిన వారిలో అత్యధిక మంది చిన్న రియల్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడ్డ వారే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేకపోవడంతో వారంతా మద్యం టెండర్లకు దూరంగా ఉన్నారు. కనీసం సిండికేట్ గా ఏర్పడి టెండర్ వేద్దామన్న అందుకు అవసరమైన కాస్త డబ్బు సకాలంలో లభించడం లేదని వాపోతున్నారు.  ఎక్కడో ఒకచోట అప్పు చేసి టెండర్ వేస్తే డ్రాలో రాకుంటే పరిస్థితి ఏమిటని ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అప్పులు చేసి రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టి ఇబ్బందులు పడుతూ మరో ఇబ్బంది తెచ్చుకోవడం అవసరమా అని ధోరణిలో ఉన్నారు.

సిండికేట్‌కే మొగ్గు

మద్యం షాపుల కేటాయింపు పూర్తిగా లక్కీ డ్రాతో కేటాయిస్తుండడంతో వ్యక్తిగతంగా టెండర్లు వేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు.  అత్యధిక టెండర్లు సిండికేట్ గా ఏర్పడి టెండర్లు వేస్తూ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  సిండికేట్ లో ఎవరికి ఒకరికి దక్కిన అందులో ఎంతో కొంత రాబడి ఉంటుందని, ఫీజు రూపంలో పెట్టిన పెట్టుబడి అయిన దక్కుతుందని భావిస్తున్నారు. ఈ ఏడాది మాత్రం పాతవారే సిండికేట్ గా ఏర్పడి టెండర్లు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. కొన్నిచోట్ల కొత్తవారు రాకుండా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం.  2023 లో వేసిన టెండర్లలో ఎక్కువ సిండికేట్లు మద్యం షాపులను దక్కించుకున్నారు. ఒక్కో సిండికేట్ లో 100కు పైగా సభ్యులు సైతం ఉండటం గమనారం.

ఈ నాలుగు రోజుల పైనే ఆశలు

మద్యం షాపులకు టెండర్లు ప్రారంభమై 20 రోజులు కావస్తున్న ఆశించిన మేర టెండర్లు రాలేదు. అయితే ఈ నెల 18న చివరి తేదీ కావడంతో సోమవారం నుండి కాస్త దరఖాస్తుల సంఖ్య పెరిగింది. ఇప్పటివరకు 145 దరఖాస్తులు వచ్చాయి. వికారాబాద్ జిల్లాలో సోమ, మంగళవారం రెండు రోజుల్లోనే సుమారు 50 పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. మిగతా నాలుగు రోజుల్లో దరఖాస్తులు భారీగానే రావొచ్చునని ఎక్సుజ్ శాఖ అధికారులు భావిస్తున్నారు.