పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదు: కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్,(విజయక్రాంతి): హైడ్రా కూల్చివేతలపై కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా ఏర్పాడకముందు ఉన్న నిర్మాణాల జోలికి వెళ్లకుండా, జులై తర్వాత కడుతున్న అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. గతంలో అనుమతులు తీసుకొని ఇప్పుడు నిర్మిస్తున్న వాటి వైపు వెళ్లాం అని, ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వాటి కూల్చివేతలు తప్పదని హైడ్రా కమిషన్ తెలిపారు. కొత్తగా తీసుకున్న అనుమతులను హైడ్రా తనిఖీలు చేస్తుందని, పేదవాళ్లు, చిన్నవాళ్ల జోలికి హైడ్రా రాదన్నారు.
పేదల ఇళ్లు హైడ్రా కూల్చివేస్తుందనే తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మొద్దు అని రంగనాథ్ సూచించారు. మూసాపేట్, ఖైత్లాపూర్‌లోని కముని చెరువు, మైసమ్మ చెరువు ఆక్రమణలు, పూడిక తీతలపై వచ్చిన ఫిర్యాదులపై స్పందించిన హైడ్రా కమిషనర్ పరిశీలించారు. చెరువుల్లో మట్టిని డంప్ చేసినా, అక్రమ నిర్మాణాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సఫ్దర్ నగర్ మరియు రాజీవ్ గాంధీ నగర్‌లలో వర్షాకాల వరదలను నివారించడానికి వాసవి కన్‌స్ట్రక్షన్ గ్రూప్ ప్రణాళికాబద్ధంగా 17 మీటర్ల వెడల్పు గల వరద కాలువను అడ్డుకున్నందుకు ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.






