మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసనసభ విరామం అనతరం ప్రారంభమైన సభ మూడు బిల్లులకు ఆమోదం తెలిపింది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లులను మంత్రులు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులపై ఎలాంటి చర్చలేకుండానే తెలంగాణ శాసనసభ ఆమోదం తెలిపింది. శాసనసభలో వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసన మధ్య బిల్లులకు ఆమోదం తెలిపారు. రాష్ట్ర పర్యాటక విధానంపై మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చను ప్రారంభించారు. అయితే బీఆర్ఎస్ నేతులు లగచర్ల రైతులను తక్షణమే విడుదల చేయాలని, ఈ అంశంపై చర్చించాలని ఆందోళన చేశారు. అక్కడితో ఆగకుండా ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. దీంతో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభను రేపటికి వాయిదా వేశారు.






