బడి పిల్లలకు కామన్ యూనిఫామ్
పాఠశాల పునఃప్రారంభం రోజు పంపిణీ
జిల్లాకు చేరిన క్లాత్ మెటీరియల్
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (విజయక్రాంతి): నూతన విద్యాసంవత్సరం జూన్ 12న ప్రారంభంకానుండటంతో హైదరాబాద్ జిల్లాలోని పాఠశాలల విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్స్ పంపిణీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు సమన్వయంతో వేగంగా చర్యలు చేపడుతున్నారు. అందుకోసం కావలసిన క్లాత్ మెటీరియల్ ‘టెస్కో’ నుంచి జిల్లాకు చేరగా మండలాల వారీగా విభజించి దుస్తులను కుట్టించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో మొత్తం 691 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా వాటిలో 500 ప్రాథమిక పాఠశాలలు, 8 ప్రాథమికొన్నత పాఠశాలలు, 183 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 235 ఎయిడెడ్ పాఠశాలలు ఉండగా వాటిలో 124 ప్రాథమిక పాఠశాలలు, 29 ప్రాథమికొన్నత పాఠశాలలు, 104 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. వీటన్నింటిలో 1,05, 281 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ ఏటా విద్యార్థులకు ఉచితంగా దుస్తులు అందించినట్లుగానే ఈసారి కూడా పంపిణీ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.
అప్పుడలా.. ఇప్పుడిలా..
గతంలో టెస్కో నుంచి జిల్లా అధికారుల ద్వారా నేరుగా వివిధ పాఠశాలలకు డ్రెస్ మెటీరియల్ వచ్చేది. ఆయా పాఠశాలల్లో ఉండే ప్రధానోపాధ్యాయులు యూనిఫామ్‌లు కుట్టడం కోసం స్థానికంగా ఉండే దర్జీలకు మెటీరియల్ ఇచ్చేవారు. కానీ ఈ సారి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. స్కూల్ పిల్లల యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ప్రధానోపాధ్యా యుడు, అమ్మ కమిటీల సభ్యులు పర్యవేక్షించాలని ఆదేశించింది.
ఇప్పటి వరకు జిల్లాకు చేరిన దాదాపు 2 లక్షల మీటర్ల క్లాత్ మెటీరియల్‌ను జిల్లా విద్యాశాఖ అధికారులు మండలాల వారీగా విభజించి పంపిణీ చేశారు. ఈ లెక్క ప్రకారం జూన్ 12న పాఠశాలలు ప్రారంభం అయ్యే నాటికి ప్రతి విద్యార్థికి ఒక జత యూనిఫామ్ మాత్రమే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జిల్లాలోని విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలంటే మరో 2.15 లక్షల మీటర్ల డ్రెస్ మెటీరియల్ రావాల్సి ఉంది.
మహిళా సంఘాలకు యూనిఫామ్స్ కుట్టే బాధ్యత
యూనిఫామ్స్ కుట్టే బాధ్యతను ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాలని ఆదేశించడంతో జిల్లా అధికారులు జీహెచ్‌ఎంసీ పరిధిలోని మహిళా సహకార సంఘాలకు అప్పగించనున్నారు. అందుకోసం ఒక యూనిఫామ్ కుట్టినందుకు రూ.50 చెల్లించనున్నారు. కేజీ నుంచి ఐదో తరగతి వరకు బాలురకు నిక్కర్, షర్ట్, బాలికలకు షర్ట్, స్కర్ట్‌లను, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్యాంటు, షర్ట్, బాలికలకు స్కర్ట్, షర్ట్ కుట్టివ్వాల్సి ఉంటుంది.
మెరూన్ కలర్ ప్యాంటు, స్కర్ట్‌తో పాటు మెరూన్, యాష్ కలర్ కలిసి ఉండే చక్స్ షర్ట్‌ను ఈ సారి యూనిఫామ్‌గా ప్రభుత్వం ఎంపిక చేసింది. కాగా ఇంకా యూనిఫామ్స్ కుట్టే పనులు ప్రారంభం కాలేదు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కావడానికి ఇంకా ఇరవై రోజుల కూడా లేకపోవడంతో అనుకున్న సమయానికి యూనిఫామ్స్ కుట్టించడం విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా విద్యార్థులకు పాఠశాలలు ప్రారంభం రోజున ఒకేసారి ఒక యూనిఫామ్ ఇస్తారా, రెండు యూనిఫామ్స్ ఇస్తారా అనేది తేలాల్సి ఉంది.
పాఠశాల ప్రారంభం రోజే దుస్తులు పంపిణీ చేస్తాం
కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల పునఃప్రారంభం (జూన్ 12) రోజే దుస్తులు పంపిణీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాం. ఇప్పటి వరకు వచ్చిన క్లాత్ మెటీరియల్‌ను జీహెచ్‌ఎంసీ ద్వారా మహిళా సంఘాలకు అందజేస్తాం. జూన్ 7 నాటికి యూనిఫామ్స్ కుట్టడాన్ని పూర్తి చేయిస్తాం.
ఆర్.రోహిణి,
డీఈవో, హైదరాబాద్






