ప్రకృతితో మమేకం
నేడు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం :
జమ్మూకశ్మీర్, గుజరాత్, అసోం రాష్ట్రాలు వరదలతో అతలాకుతలమవుతుంటే, దక్షిణాది రాష్ట్రాలు వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలాంటి వైరుధ్యాలు, వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. ప్రకృతిలో సమతుల్యత లోపించడం, ప్రకృతి విధ్వంసం జరగడమే ఈ మార్పులకు కారణం. ప్రకృతిని పరిరక్షించగలిగితేనే ధరిత్రిపై మానవులు మనుగడ సాగించగలరు.
పచ్చదనానికి పాడె కడితే మానవ పయనం కాటికే దారితీస్తుంది. ఈ సత్యాన్ని గ్రహించక తాత్కాలిక సౌకర్యాల కోసం మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నాం. భవిష్యత్ తరాలకు స్థిరమైన ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించాలనే ధ్యేయంతో ఏటా జూలై 28 వ తేదీని ‘ప్రకృతి పరిరక్షణ దినం’గా పాటిస్తున్నాం. కాలుష్య కారకాలతో, వ్యాధులతో, వైరస్‌లతో ప్రపంచం అతలాకుతలమైపోతున్న నేపథ్యంలో 2026వ సంవత్సరం జూలై 28వ తేదీన జరిగే ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవానికి ప్రాధాన్యత పెరిగింది.
రాబోయే తరాల భవిష్యత్తు కోసం ప్రకృతి పరిరక్షణ వైపు అడుగులు పడాలి. మన ముందు తరాలు ముందు చూపుతో ప్రకృతి పట్ల శ్రద్ధ చూపేవారు. పంచభూతాలను ఆరాధ్య దైవాలుగా భావించేవారు. వారు ఆచరించి, ఆరాధించిన ప్రతీ పని వెనుక ఒక పరమార్థం దాగి ఉంది. నాటి మన పెద్దల ఆచార వ్యవహారాలు, జీవన విధానం వారి ముందుచూపునకు నిదర్శమని వర్తమాన పరిణామాలను బట్టి అవగతమవుతున్నది.
పచ్చదనం పట్ల వారికున్న మక్కువ, నీటి వినియోగంలో పొదుపు, ఆరోగ్య పరిరక్షణకు అవలంభించిన విధానాలు, వనమూలికలతో వైద్యం, మొక్కల పెంపకం, పశు పెంపకం, వివిధ జీవరాశుల మనుగడ పట్ల ఆసక్తి, అందుకు వారు అవలంభించిన విధానం, మనకు తిండినిచ్చిన నేలతల్లిని కృతజ్ఞతాభావంతో ఆరాధించడం, ప్రతీ పర్వదినానికి ఒక అర్థాన్ని సూచించడంలోని లోతైన విశ్లేషణ మానవ జాతి పదికాలాల పాటు సుభిక్షంగా వర్ధిల్లాలనే వారి ఆకాంక్షను వెల్లడిస్తున్నది.
అయితే గత తరాల దార్శనికతను మూఢత్వంగా భావించి, హేళన చేసి, ఆధునికత్వం పేరుతో ప్రకృతిని పరిహసించిన ఫలితాన్ని నేడు మనం అనుభవిస్తున్నాం. ప్రకృతి సిద్ధమైన జీవన విధానాన్ని విస్మరించి, కాంక్రీట్ కట్టడాల మధ్య మన జీవితాలను మనమే సమాధి చేసుకుంటున్నాం. అడవులు ధ్వంసమైపోతున్నాయి. తాగునీటికి, సాగునీటికి ప్రాంతాల మధ్య విబేధాలు తలెత్తుతున్నాయి. చినుకు పడితే జనారణ్యాలన్నీ సంద్రంలా మారిపోతున్నాయి.
మానవ స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. మానవ తప్పిదాలే మానవాళికి ముప్పుగా పరిణమించాయి. సహజ వనరులు తరిగి పోతున్నాయి. మానవ అవసరాలు పెరిగిపోతున్నాయి. గాలి, నీరు కలుషితమైపోయింది. పచ్చదనం హరించుకుపోయింది. వాహన కాలుష్యం పెరిగిపోయింది. పీల్చే గాలిలో, తాగే నీటిలో, తినే తిండిలో స్వచ్ఛత లోపించింది. ప్లాస్టిక్ వినియోగం వలన పర్యావరణానికి జరుగుతున్న నష్టం అంచనాకు అందని విధంగా ఉంది. మానవ దురాలోచన దూరదృష్టిని హరించింది.
ప్రకృతిని పరిహసించింది. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. శాస్త్రజ్ఞులకు అంతుబట్టని బ్యాక్టీరియాలు, వైరస్‌లు విజృంభిస్తున్నాయి. ప్రకృతిని పరిరక్షించడంలో ఇకనైనా జాప్యం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. రాబోయే మానవ విలయాన్ని ఆపాలి. తరిగిపోతున్న సహజ వనరులను కాపాడాలి. కాలుష్యరహితమైన ప్రత్యామ్నాయ ఇంధన వనరులను వినియోగించాలి. రసాయనాల వాడకాన్ని తగ్గించగలగాలి. సహజసిద్ధమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి.
మొక్కల పెంపకానికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి. భూతాపాన్ని తగ్గించడానికి ప్రపంచ దేశాలన్నీ ఏకతాటిపైకి రావాలి. పచ్చదనాన్ని పెంపొందించాలి. సకల జీవరాశులు ప్రకృతిలో మమేకమై జీవించాలి. ప్రకృతి సమతుల్యత, పరిరక్షణ మీదనే ప్రపంచ మనుగడ ఆధారపడి ఉన్నది. ప్రకృతి పరిరక్షణను సామాజిక బాధ్యత-గా స్వీకరించాలి.
సుంకవల్లి సత్తిరాజు
వ్యాసకర్త సెల్: 9704903463






