మోదీ హవా తగ్గుతోందా?
కంచ రాజు :
మేక్ ఇన్ ఇండియాతో దేశాన్ని ఊపేసిన నాయకుడు మూడోసారి అధికారంలోకి వచ్చాక మాత్రం రాజకీయ సమీకరణాలతో సతమతమవుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తున్నది. ఒకప్పుడు మోదీ అంటే విజయం అనే భావన భారతీయ రాజకీయాల్లో బలం గా ఉండేది. 2014లో మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్వచ్ఛ భారత్ వంటి కార్యక్రమాలతో దేశ రాజకీయాల్లో సరికొత్త సంప్రదాయానికి తెరలేపిన నరేంద్ర మోదీ, అంతర్జాతీయ వేదికలపై కూడా భారతదేశ ప్రతిష్టను పెంచిన నాయకుడిగా గుర్తింపు పొందారు.
అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు, జీ-20 నుంచి ఐక్యరాజ్యసమితి వేదిక వరకు మోదీ హవా స్పష్టంగా కనిపించింది. దేశంలోనూ, విదేశాల్లోనూ వ్యక్తిగత ఇమేజ్‌ను రాజకీయ బలంగా మార్చుకున్న అరుదైన నాయకుల్లో మోదీ ఒకరు. కానీ, ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, అదేమిటంటే ఆ మోదీ మేనియా ఇప్పటికీ అదే స్థాయిలో ఉందా? లేక క్రమంగా తగ్గుముఖం పడుతోందా?
చార్ సౌ పార్‌కు బ్రేక్
2024 లోక్‌సభ ఎన్నికల ముందు బీజేపీ అబ్ కీ బార్.. చార్ సౌ పార్ అనే నినాదా న్ని బలంగా ప్రచారం చేసింది. రాజ్యాంగ సవరణలకు కూడా ప్రజలు తమకు అపారమైన మెజారిటీ ఇస్తారని పార్టీ నాయక త్వం విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు ఆ అంచనాలకు భిన్నంగా వచ్చాయి. బీజేపీ 240 స్థానాలకే పరిమితమైంది. సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీని దక్కించుకోలేదు.
ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ, అది ఇప్పుడు మిత్రపక్షాల మద్దతుపైనే ఆధారపడి ఉంది. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనతాదళ్ (యునైటెడ్) నాయకుడు నితీశ్ కుమార్ మద్దతు లేకుండా ప్రభుత్వం కొనసాగడం సాధ్యం కాదనే రాజకీయ వాస్తవం స్పష్టంగా కనిపిస్తోంది.
వ్యవసాయ చట్టాలతో మొదలై
2014, 2019లో దేశాన్ని పాలించిన మోదీకి, 2024లో అధికారంలో ఉన్న మోదీకి మధ్య ఉన్న అతిపెద్ద వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. అదేమిటంటే, ప్రజాఆందోళనలకు తలొగ్గి సర్కార్ నిర్ణయాలను వెనక్కి తీసుకోవడం. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గదనే పేరు మోదీ ప్రభుత్వానికి ఒకప్పుడు ఉండేది. అయితే గత కొన్నేళ్లలో కొన్ని కీలక నిర్ణయాల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సి వచ్చింది.
మూడు వ్యవసాయ చట్టాలను రైతు ఉద్యమం తర్వాత ఉపసంహరించుకోవడం, భూసేకరణ చట్ట సవరణలను విరమించుకోవడం, లాటరల్ ఎంట్రీ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకోవడం వంటివి మనం చూశాం. ఇవి ప్రభుత్వం రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు మార్చుకుంటోందనే అభిప్రాయానికి బలం చేకూర్చాయి.
కొత్త రాజకీయ సవాల్
ఇటీవలి కాలంలో ఉద్యోగాలు, పరీక్షల పారదర్శకత, పేపర్ లీక్‌లు, డిజిటల్ ప్రచారాల వంటి అంశాలపై యువత సోషల్ మీడియా ద్వారా వేగంగా సంఘటితమవుతోంది. ప్రత్యేకించి నీట్, సీబీఎస్‌ఈ పరీక్షలపై వచ్చిన వివాదాలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచాయి. అంతేకాదు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేసిన పోరాటానికి ఏకంగా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం సెల్ఫీ వీడియోలో తన సందేశాన్ని పంపారు. చివరికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇది సంప్రదాయ రాజకీయాలకు భిన్నమైన సవాలుగా చెప్పాలి. ఒకప్పుడు ప్రతిపక్షాలే ప్రధాన సవాలుగా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా సంఘటితమవుతున్న జెన్ జీ కూడా ప్రభుత్వాలపై రాజకీయ ఒత్తిడి తీసుకొస్తున్న కొత్త శక్తిగా మారుతోంది.
బీజేపీకి దేశంలో పరీక్ష
ప్రపంచ నాయకులతో సత్సంబంధాలు, భారత విదేశాంగానికి వచ్చిన గుర్తింపు, జీ-20 విజయవంతమైన నిర్వహణ వంటి అంశాల్లో మోదీకి ఇప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అయితే దేశ రాజకీయాల్లో మాత్రం పరిస్థితులు మారాయి. సంపూర్ణ మెజారిటీ లేకపోవడం, మిత్రపక్షాల అవసరం పెరగడం, ప్రతిపక్షాలు బలపడటం, యువత ఆశలు, ఉపాధి వంటి అంశాలు ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని సృష్టిస్తున్నాయి.
మోదీ మేనియా పూర్తిగా ముగిసిపోయిన అధ్యాయమని చెప్పడం రాజకీయ వాస్తవాలకు సరిపోదు. అదే సమయంలో 2014, 2019లో కనిపించిన అజేయ రాజకీయ ఆధిపత్యం ఇప్పుడు యథాతథంగా కొనసాగుతోందని చెప్పడం కూడా కష్టం. ఒకప్పుడు ఎన్నికల్లో మోదీ పేరు ఒక్కటే బీజేపీకి అతిపెద్ద బలం. ఇప్పుడు మాత్రం సంకీర్ణ రాజకీయాలు, ప్రాంతీయ పార్టీల ప్రభావం, యువత అంచనాలు, ప్రజాభిప్రాయం ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
వ్యాసకర్త: తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమ్ ప్రతినిధి,
9963801882






