మారిన మిడిల్‌క్లాస్ జెన్ జీ
కులమతాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల ప్రభావం ఎలా ఉన్నా, గత దశాబ్ద కాలంగా బీజేపీ విజయంలో మధ్యతరగతి కీలక భూమిక పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పట్టణ, నగర ప్రాంతాల్లోని మధ్యతరగతికి చెందిన విద్యావంతులు, ఉద్యోగ, చిరు వ్యాపార వర్గాలు ఆ పార్టీకి బలంగా మద్దతిచ్చాయి.
అయితే, ఇప్పుడు అదే మధ్యతరగతి యువత కేంద్రంలోని అధికార పార్టీకి క్రమంగా దూరమవుతుండటం దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం. ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన జెన్ జీ ఉద్యమం సాక్షిగా ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మధ్యతరగతికి చెందిన జెన్ జీ యువత కులం, మతం, ప్రాంతం, కుటుంబ రాజకీయ అనుబంధాలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడం కొట్టొచ్చినట్టు కనిపించింది.
తమ భవిష్యత్తును ప్రభావితం చేసే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, విద్యావ్యవస్థలో పారదర్శకత, ప్రభుత్వ నియామకాల్లో నిష్పక్షపాత విధానం, ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ వంటి అంశాలపైనే యువత దృష్టి కేంద్రీకరించడం విశేషం. వాస్తవానికి, మొన్నటివరకు మధ్యతరగతి సహా అన్ని వర్గాల్లో కుటుంబ రాజకీయ అభిప్రాయాలే యువతపై ప్రభావం చూపేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి మారుతున్నది.
విద్యావేత్తలు కావడం, సోషల్ మీడియా మూలంగా యువత స్వతంత్రంగా ఆలోచిస్తున్నది. కుటుంబ రాజకీయ అభిప్రాయాలను పక్కనపెట్టిన యువత ఇప్పుడు తమకు ఏది మేలు చేస్తుందన్న అంశంపైనే ఎక్కువ దృష్టి పెడుతుండటం శుభపరిణామం. ముఖ్యంగా పరీక్షల నిర్వహణలో లోపాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి విషయాలు యువతలో తీవ్ర అసంతృప్తిని పెంచాయని చెప్పక తప్పదు.
యువత ఇప్పుడు వాగ్దానాలను కాదు, సమస్యలకు తక్షణ పరిష్కారాన్ని కోరుతున్నారు. అందుకే అధికార పక్షం సహా ఏ రాజకీయ పార్టీ అన్నది చూడకుండా జవాబుదారీతనం, పారదర్శకతను యువత డిమాండ్ చేస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న యువత ఆలోచనలకు అనుగుణంగానే మధ్యతరగతి కుటుంబాల్లోని కొత్త తరం కూడా సరికొత్త పంథాను ఎంచుకోవడం సహజ పరిణామమనే చెప్పాలి.
మధ్యతరగతి యువత ప్రత్యామ్నాయ రాజకీయాలను ఆశిస్తున్న ప్రస్తుత తరుణంలో దేశంలోని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీకి రాబోయే రోజుల్లో గడ్డుకాలం తప్పదనే విశ్లేషణలు వినవస్తున్నాయి. అయితే ఈ మార్పు తాత్కాలికమా, రాజకీయాల్లో శాశ్వత మార్పులకు నాంది పలుకుతుందా? అన్నది చూడాలి.






