9 April, 2026 | 8:55 AM

హెదరాబాద్.. బిందాస్!

14-05-2024 01:06 AM

రాజధానిలో పోలింగ్ అంతంతే

గ్రామాలకు, ఏపీకి వెళ్లిపోయిన అనేకమంది

ఉన్నవాళ్లలో ఇండ్లు కదలని మరికొందరు

రాష్ట్రంలోనే అతి తక్కువ పోలింగ్ నమోదు

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 13 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఓటర్ల తీరు మారలేదు. ఎప్పటిలాగనే హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల పరిధిలో అత్యల్ప పోలింగ్ నమోదు అయ్యింది. సోమవారం సాయంత్రం 6 గంటలవరకు హైదరాబాద్ లోక్‌సభ పరిధిలో అత్యంత తక్కువగా 39.17 శాతం పోలింగ్ నమోదైంది. గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 44.04 శాతం పోలింగ్ నమోదు కాగా, బహదూర్‌పురాలో అత్యల్పంగా 34 శాతం మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. సికింద్రాబాద్ లోక్‌సభ పరిధిలో 42.48 శాతం ఓటింగ్ నమోదైంది.

ఇందులో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గపరిధిలో అత్యధికంగా 52.1 శాతం, ముషీరాబాద్‌లో అత్యల్పంగా 45 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. అత్యధికంగా కాలనీఉన్న సనత్‌నగర్, ధనవంతులుండే జూబ్లీహిల్స్ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ అంతంతే ఉన్నది. గత ఎన్నికల్లో సికింద్రాబాద్‌లో 46.50 శాతం, హైదరాబాద్‌లో 44.84 శాతం పోలింగ్ నమోదయ్యింది.  

ఓటు చైతన్య ప్రచారం వృధా

ఓటర్లను పోలింగ్‌స్టేషన్ వరకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈసారి ఎన్నికల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలను నిర్వహించాయి. కానీ ఫలితం శూన్యం. పోలింగ్ రోజు ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు ఇచ్చినప్పటికీ నగర ప్రజలు ఓటు వేసేందుకు పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. సోమవారం ఉదయం ౭ గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు కూడా పోలింగ్ మందకొడిగానే సాగింది.

బస్తీల్లోని పేదలు ఓటు వేయడానికి ఆసక్తి చూపగా, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఓటు వేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే, ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేసేందుకు హైదరాబాద్‌లోని ఆ రాష్ట్ర ప్రజలు భారీగా తరలివెళ్లటంతో నగరంలో పోలింగ్ తగ్గిందని భావిస్తున్నారు. మహానగరంలో నివాసం ఉంటున్న తెలంగాణ జిల్లాలవాసులు కూడా తమ సొంత ప్రాంతాల్లో ఓటువేసేందుకు భారీగా తరలివెళ్లారు. నగరంలో పోలింగ్ శాతంపై ఈ ప్రభావం కూడా పడిందని చెప్తున్నారు.