9 May, 2026 | 6:16 AM

‘రియల్’ కంపెనీలపై ఫిర్యాదు

11-12-2024 12:21 AM

ఆ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోండి: బీజేపీ ఎమ్మెల్యే 

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 10 (విజయక్రాంతి):  ప్రముఖ రియల్  ఎస్టేట్ కంపెనీలపై బీజేపీ పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి మంగళవారం పలు శాఖల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ, రెరా, టీజీఐఐసీ, హైడ్రాలకు ఆయన ఫిర్యాదును అందజేశారు.

రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గోపన్‌పల్లిలోని సర్వే నంబర్ 28, 29, 30లలో నిబంధనలకు విరుద్ధంగా వజ్రం చేపట్టిన ప్రాజెక్టులపై జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు, టీజీ రెరా చైర్మన్‌కు, హైడ్రా కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ గండిమైసమ్మ మండలం గోగిలాపూర్‌లోని సర్వే నంబర్ 201పి, 202పి, 203పి, 204, 205, 206, 207, 208, 212పి లలో ప్రణీత్ ప్రణవ్ గ్రోవ్ పార్క్ నిబంధనలను ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్‌లో సర్వే నంబర్ 57, 58, 59, 60, 61, 62, 63, 64, 68, 86లలో అక్రమంగా అపార్ట్‌మెంట్లు, విల్లా లు నిర్మించినట్టు ఆయన ఫిర్యాదులో తెలిపారు.

రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో సర్వే నంబర్ 285, నార్సింగి గ్రామంలో 185, 186 సర్వే నంబర్లలో నిబంధనలను ఉల్లంఘించి ఫోనిక్స్ నిర్మాణాలు చేసినట్టు పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన రియల్ సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారు లను ఆయన కోరారు.