9 May, 2026 | 7:04 AM

అనుమతి లేకుండా వస్తే చర్యలు

11-12-2024 12:23 AM

* వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులకు డీహెచ్ ఆదేశాలు 

హైదరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): విధులు మానేసి నిత్యం రాష్ట్ర రాజధానిలోని కోఠిలో ఉన్న వైద్య,ఆరోగ్య శాఖ రాష్ట్ర కార్యాలయాల చుట్టూ తిరిగే ఆశాఖ ఉద్యోగులు, అధికారులకు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ కఠిన ఆదేశాలు జారీ చేశారు. పని ఉన్నా, లేకున్నా అనేక పైరవీల కోసం ఎప్పుడూ కోఠిలోనే ఉండే పలువురు ఉద్యోగులు, అధికారుల వల్ల కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది, అధికారులకు తీవ్రంగా ఇబ్బందులతో పాటు అంతరాయం కలుగుతోందని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇకపై ఇష్టానుసారంగా కోఠిలోని డీహెచ్, డీఎంఈ, వైద్యవిధాన పరిషత్, ఎన్‌హెచ్‌ఎం, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయాలకు వచ్చే వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు, అధికారులు తమ ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకుని, సెలవు పెట్టి రావాలని మంగళవారం నాడు పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మెమో జారీ చేశారు.

కోఠిలోని వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్ర కార్యాలయాలకు వచ్చే ఉద్యోగులు కచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే రావాలని, కార్యాలయాల ప్రవేశ ద్వారాల వద్ద ఉండే రిజిస్టర్‌లో తమ వివరాలను నమోదు చేసిన తర్వాతే వారికి అనుమతి ఇస్తామన్నారు. ఈ నియమాలను పాటిం చని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డీహెచ్ హెచ్చరించారు.