కడియాలకుంట సర్పంచ్‌పై ఎమ్మెల్యేకు ఫిర్యాదు
సర్పంచ్ తనతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని వీర్లపల్లికి ఆశా కార్యకర్త ఫిర్యాదు
షాద్‌నగర్, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఒక గ్రామ సర్పంచ్ సాధారణ ఆశ కార్యకర్తపై వేధింపులకు దిగడం.. భయాందోళన లకు గురి చేయడంతో మహిళ నేరుగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను కలిసి ఫిర్యాదు చేసిన సంఘటన వెలుగు చూసింది. ఫరూక్ నగర్ మండలం కడియాల కుంట తండాకు చెందిన ఓ ఆశా కార్యకర్త తన విధులు నిర్వహిస్తుండగా గత కొన్ని నెలలుగా గ్రామ సర్పంచ్ తన పట్ల అనుచితంగా, అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
పిల్లల సంరక్షణ, టీకాలు తదితర వ్యవహారాలలో తాను పనిలో నిమగ్నమై ఉండగా సర్పంచ్ కలగజేసుకుని తన పట్ల అవమానకరంగా, అసభ్యకరంగా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఈనెల 26వ తేదీన ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ కారణంగా తాను విధుల్లో ఉండగా అకారణంగా నువ్వు పనికిమాలిన దానివి, వేస్ట్ ముండదానివి అంటూ దుర్భాషలాడాడని తెలిపారు. నేను పిఎం కన్నా, సీఎం కన్నా తోపుని ఏం చేసుకుంటావో చేసుకోఅని అనుచితంగా ప్రవర్తించారని వెల్లడించారు.
ఇతని కారణం గా తాను తీవ్ర అవమానాలకు గురవుతున్నారని, ఒక మహిళగా తన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని పేర్కొన్నారు. ఒక ప్రజా ప్రతినిధి ఇలా ప్రవర్తించడం వల్ల తన విధి నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతుందని ఆమె స్పష్టం చేశారు. సర్పంచ్ పై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. దీనిపై సాను కూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ విచారణ జరిపి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.






