ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు జిల్లాలకు విడుదల చేయాలి
దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షుడు కృష్ణ స్వరూప్
ముషీరాబాద్, ఆగస్టు 30(విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను జిల్లాలకు విడుదల చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని దళిత బహుజన పార్టీ (డీబీపి) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆదివారం పార్టీ నేతలు వినతిపత్రం అందజేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా కృష్ణ స్వరూప్ మాట్లాడుతూ దళిత సమాజం సామాజిక, ఆర్థిక, జీవన అభివృద్ధి కోసం కేటాయించిన సబ్ప్లాన్ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా దారిమళ్లిస్తోందని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను జిల్లా కలెక్టర్లు, జిల్లా అభివృద్ధి అధికారులకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై పార్టీ తరఫున పోరాటం చేస్తామని, త్వరలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రిని కలిసి నిధుల విడుదలకు చర్యలు కోరుతామని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా దక్కాల్సిన నిధులను సాధించేందుకు కృషి చేస్తామని పార్టీ నేతలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు పులి రాజారామ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు నీరాటి శంకర్, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ నిచ్చికోల రామ్ చందర్, ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎ. రాజన్న, నిర్మల్ జిల్లా ఇంచార్జ్ అరే రమేష్, కొమురం భీమ్ జిల్లా అధ్యక్షుడు దయాకర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.






