31 August, 2026 | 2:45 AM

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.. పండుగల వేళ హిందువులపై వేధింపులు ఆపాలి: రావు పద్మ

31-08-2026 01:48 AM
  1. ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడికి వత్తాసు పలుకుతున్న హనుమకొండ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలి
  2. రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు కోసం బీజేపీ పోరాడుతుంది.
  3. ఎమ్మెల్యేను మేము గౌరవిస్తాం... కానీ ఎమ్మెల్యే ఆంధ్రా అల్లుడి పెత్తనం ఏంటి?

హనుమకొండ, ఆగస్టు 30(విజయ క్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది.ఆదివారం రాగన్న దర్వాజా వద్ద జరుగుతున్న పోచమ్మ బోనాల సందర్భంగా బీజేపీ కార్యకర్తలు బన్నీ, బంటి,రాహుల్, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ లకు చెందిన నాయకుల అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే తెల్లవారుజామున పోలీసులు జంగా రాఘవరెడ్డి అనుచరులు, బీజేపీ కార్యకర్తలు బీఆర్‌ఎస్ నాయకులు రంజిత్ రెడ్డి అభిమానులను అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి.

దీంతో బీజేపీ మాజీ అధ్యక్షు రాలు రావు పద్మ ఆధ్వర్యంలో బీజేపీ హనుమకొండ అధ్యక్షులు సంతోష్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ దాస్యం అభినవ్ భాస్కర్,కార్యకర్తలు హనుమకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకుని నిరసన తెలిపారు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా, ఇతర పార్టీల వారినే లక్ష్యంగా చేసుకోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. జంగా రాఘవరెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వ్యక్తి అందుబాటులో లేకపోవడంతో అతని తండ్రిని స్టేషన్ కు తీసుకెళ్లారని యువకులు ఆరోపించారు.

ఫ్లెక్సీల విషయంలో అందరికీ ఒకే నిబంధనలు అమలు చేయాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. హిందూ పండుగలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతులు కావాలా? అంటూ  బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే అరెస్టులు జరిగాయని ఆరోపిస్తూ, ప్రస్తుతం నియోజకవర్గంలో మామ, ఆంధ్రా అల్లుడుల అరాచకాలు సాగుతున్నాయని బీజేపీ రాష్ట్రనాయకురాలు రావు పద్మ ఆరోపించారు.

రాజకీయాలకు అతీతంగా ప్రతి హిందువు హక్కుల కోసం, పండుగలను స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుపుకోవడం కోసం తాము ఎప్పుడూ ముందుండి పోరాడతామని స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉండే వరంగల్ వాతావరణాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని, ఇలాంటి నిరంకుశ చర్యలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.