26-05-2025 08:29:57 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై జిల్లా అధికారులతో నిర్వహించిన సమ్మిలిత సమావేశంలో ఇందిరమ్మ ఇండ్లు, దర్తి ఆబా యోజన, జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు, పౌరసరఫరాలు తదితర అంశాలపై సమీక్షించారు.
ముఖ్యంగా వచ్చే వానకాలం రైతులను ప్రత్యామ్నాయ పంటలతో పాటు, అంతర పంటలవైపు ప్రోత్సహించాలని, ఆ విధంగా ప్రణాళిక రూపొందించాల్సిందిగా వ్యవసాయ శాఖ జిల్లా అధికారిని ఆదేశించారు. జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యఅతిథి సందేశానికి ఆయా శాఖల అధికారులు వెంటనే వారి శాఖలకు సంబంధించిన నోట్స్ ను చేయాలని ముఖ్య ప్రణాళిక అధికారికి పంపించాలని ఆదేశించారు.
వేడుకల సందర్భంగా అవసరమైన ఇతర అన్ని ఏర్పాట్లను చూడాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ధర్తీ ఆభా యోజన కింద కింద పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు సమర్పించాలని, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి దరఖాస్తుల పరిశీలన జాబితాను అప్డేట్ చేయాలని చెప్పారు. కాగా, ఈ సోమవారం 84 మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించగా, ఎప్పటిలాగే వ్యక్తిగత అంశాలు, ఉద్యోగ ఉపాధి అంశాలకు సంబంధించి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఇన్చార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఇన్చార్జి డిఆర్ఓ వై. అశోక్ రెడ్డి, డిఆర్డిఏ పిడి శేఖర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, ఇతర అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.