22-07-2025 10:34:57 AM
చెన్నై: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (International Maritime Boundary Line) దాటారనే ఆరోపణలతో తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం సోమవారం అరెస్టు చేసి, వారి పడవను స్వాధీనం చేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున రామేశ్వరం ఫిషింగ్ పోర్టు నుండి 88 పడవలలో దాదాపు 400 మంది మత్స్యకారులు సముద్రంలోకి బయలుదేరారు. తలైమన్నార్, ధనుష్కోడి మధ్య జలాల్లో చేపలు పడుతుండగా, శ్రీలంక నేవీ గస్తీ నౌక వారిని అడ్డుకుంది. మునియసామి అనే జాలరికి చెందిన పడవను నేవీ స్వాధీనం చేసుకుంది. సముద్ర సరిహద్దును ఉల్లంఘించినందుకు అందులో ఉన్న నలుగురిని అరెస్టు చేసింది.
ప్రాథమిక విచారణ తర్వాత, అరెస్టు చేసిన మత్స్యకారులను తదుపరి చర్యల కోసం మన్నార్ మత్స్య శాఖ(Mannar Fisheries Department) అధికారులకు అప్పగించే అవకాశం ఉంది. జనవరి 2025 నుండి శ్రీలంక అధికారులు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడినందుకు 185 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసి, 25 పడవలను స్వాధీనం చేసుకున్నారు. జూన్ 29న ఇలాంటి సంఘటనలో, రామేశ్వరానికి చెందిన ఎనిమిది మంది భారతీయ జాలర్లను ఐఎంబీఎల్(IMBL) దాటినందుకు శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. దాదాపు 3,000 మంది మత్స్యకారులు 370 పడవల్లో సముద్రంలోకి వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు, వారిలో చాలామంది ఉత్తర మన్నార్ ప్రాంతం సమీపంలో శ్రీలంక నేవీ(Sri Lankan Navy) గస్తీ పడవలు తమను చుట్టుముట్టాయని పేర్కొన్నారు. గందరగోళం మధ్య, ఎనిమిది మంది మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నారు. వారి యాంత్రిక పడవను స్వాధీనం చేసుకున్నారు. వారిని తలైమన్నార్ నావల్ క్యాంప్‌కు తరలించారు.