రాజీనే రాజమార్గం
రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్
ఎల్బీనగర్, జూన్ 20 : రాజీనే రాజమార్గం అని, కక్షిదారులు కోర్టు కేసులను పరస్పర అంగీకారంతో కేసును పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ అన్నారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లాలోని అన్ని కోర్ట్ ప్రాంగణాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ మాట్లాడుతూ... జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్, మధ్యవర్తిత్వం ఒక మంచి వేదిక అని చెప్పారు. లోక్ అదాలత్ లో కేసు రాజీ అవ్వడం ద్వారా ఇరు వర్గాలు గెలిచినట్టే అని అన్నారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అనూష మాట్లాడుతూ... రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా అన్ని కోర్ట్ ప్రాంగణాల్లో 25 లోక్ అదాలత్ బెంచ్ లను ఏర్పాటు చేశామని, ఇందులో రాజీకి ఆమోద యోగ్యమైన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు వాహన ప్రమాద బీమా కేసులు, కన్జ్యూమర్ కోర్టు కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు చెప్పారు.
సుమారు 51,000 పై చిలుకు కేసులు పరిష్కరించి, అన్ని కేసుల్లో కలిపి 7,54,43,179 నష్ట పరిహారాన్ని కక్షిదారులకు ఇప్పించినట్లు తెలిపారు.హయత్ నగర్ కోర్టులో...హయత్ నగర్ కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు అదనపు జూనియర్ సివిల్ జడ్జీలు సిరిసిల్ల ప్రియంకా, పర్హీన్ బేగమ్ తెలిపారు. మొత్తం 4011 కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.






