నాలుగు నెలలైనా రోడ్డు పనులు ప్రారంభించలేదు
బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి
బంజారాహిల్స్, జూన్ 20(విజయక్రాంతి): బంజారాహిల్స్ డివిజనులోని ఎన్బీనగర్ మెహిఫిల్, పోలీస్ పెంటయ్య లైన్లలో రోడ్డు పనులు మంజూరై నాలుగు నెలలైంది. అయినప్పటికీ ఇంకా పనులను ప్రారంభించలేదని బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఎన్బీనగర్ నాయకులు దేశెట్టి రమేశ్, ఆయూశ్ పిలుపు మేరకు బస్తీలో ఆయన శనివారం పాదయాత్ర నిర్వహించారు. స్థానికులతో మాట్లాడి స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు.
ప్రధానంగా రోడ్డు సమస్య ఉండడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ఈ విషయమై గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మెహిఫిల్, పెంటయ్య లైన్లలో డ్రైనేజీ పనులు పూర్తయినా ఇప్పటి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదన్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రజలు ఇబ్బంది పడకుండా రోడ్డు నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని ఫోన్ కాల్ ద్వారా జిహెచ్‌ఎంసీ అధికారులను డిమాండ్ చేశారు. అదే విధంగా బస్తీలో నెలకొన్న నీటి సరఫరా సమస్యల విషయమై జలమండలి మేనేజర్ అభిషేక్, లైన్మెన్ షకీల్ తో మాట్లాడి పరిష్కార చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల విజయ్ కుమార్, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, అన్వర్, ఓర్సు పెంటయ్య, నవీన్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.






