నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ
స్తూపం ఆవిష్కరణ, సంస్మరణ సభలో వక్తల నివాళి
మునుగోడు, మార్చి 5 : నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్తగా పనిచేసిన కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ లేకపోవడం పార్టీకి, ప్రజాతంత్ర ఉద్యమానికి తీరని లోటని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజా, విజ్ఞాన దర్శిని ఫౌండర్ రమేష్, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు.
గురువారం మునుగోడు మండలం కల్వకుంట్ల గ్రామంలో ముత్తమ్మ స్తూపం ఆవిష్కరణ అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కట్ట లింగస్వామి అధ్యక్షతన సంస్మరణ సభ సమావేశంలో వక్తలు మాట్లాడారు. గ్రామ మాజీ సర్పంచ్ సింగపంగా నరసింహ మరణించిన తర్వాత కూడా కుటుంబ, రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొంటూ ముత్తమ్మ పార్టీ ఆశయాల కోసం నిబద్ధతతో పనిచేశారన్నారు. అంగన్వాడి ఆయాగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అనేక పోరాటాల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు.
మూఢనమ్మకాలను వ్యతిరేకించి శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలని, ప్రజలు రాజ్యాంగంపై అవగాహన పెంచుకొని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ రామచంద్రయ్య, సమత సబ్ కమిటీ సభ్యురాలు ప్రొఫెసర్ విజయలక్ష్మి, జెవివి రాష్ట్ర కార్యదర్శి నన్నూరి వెంకటరమణారెడ్డి, టిపిటిఎల్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అయిత విజయ్ కుమార్, గ్రామ సర్పంచ్ సింగపంగా లక్ష్మమ్మ, సిపిఎం జిల్లా నాయకులు చాపల మారయ్య, మండల కార్యదర్శి సాగర్ల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.




