2 July, 2026 | 2:14 AM

ప్రేమ్‌నగర్‌లో వీధిదీపాల సమస్య

02-07-2026 01:27 AM
  1. రాత్రి వేళల్లో ఇబ్బంది పడుతున్న స్థానికులు
  2. మురుగునీటి సమస్య పరిష్కరించాలని వినతి
  3. అధికారులతో మాట్లాడిన మన్నె గోవర్ధన్ రెడ్డి

ఖైరతాబాద్, జూలై 1 (విజయక్రాంతి): బంజారాహిల్స్ డివిజన్ పరిధిలోని ప్రేమ్ నగర్ వాసులు గత కొంత కాలంగా వీధి దీపాల సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రివేళల్లో పాదచారులు రాకపోకలు సాగించేందుకు కూడా భయపడే పరిస్థితి నెలకొంటుందంటున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించలేదని పేర్కొంటున్నారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగం గా ప్రేమ్ నగర్లో పర్యటించిన బీఆర్‌ఎస్ ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జి మన్నె గోవర్ధన్ రెడ్డికి సమస్యను వివరించారు. అదే విధంగా స్థానికంగా మురుగునీరు రోడ్డుపై పారుతోందని ఆయన దృష్టికి తీసుకొచ్చారు.

స్తానికంగా ఉన్న బోరింగ్ కూడా పనిచేయక ఏండ్లు గడుస్తోందని వాపోయారు. వాటికి తక్షణ పరిష్కారం చూపించి నివాసితులకు ఉపశమనం కల్పించాలని విన్నవించారు. వారి వినతిపై స్పందించిన మన్నె గోవర్ధన్ రెడ్డి వెంటనే జిహెచ్‌ఎంసీ అధికారులతో ఫోను ద్వారా మాట్లాడారు. స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు మాట్లాడుతూ వీధి దీపాల సమస్యను రెండొ రోజుల్లో పరిష్కరిస్తామని హామీనిచ్చారని గోవర్ధన్ రెడ్డి అన్నారు. రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్ అధికారి రాజగోపాల్ బోరింగ్ మరమ్మతుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, సునీత, శకుంతల, నాని, కుమార్ తదితరులు పాల్గొన్నారు.