మరణానికీ రేటు.. గద్వాలలో సెటిల్మెంట్ సంస్కృతిపై ఆందోళన
ప్రాణం పోయినా.. పరిహారంతో కేసుకు ముగింపు?
గద్వాల టౌన్, ఆగస్టు 23: ఒక మనిషి ప్రాణానికి డబ్బుతో విలువ కట్టగలమా? నేరానికి చట్టపరంగా సమాధానం చెప్పాల్సిన వ్యక్తి, బాధిత కుటుంబానికి కొంత మొత్తం చెల్లించి వ్యవహారాన్ని ముగించుకుంటే.. అది న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయదా? గద్వాలలో ఇటీవల చోటుచేసుకున్న కొన్ని విషాద ఘటనల నేపథ్యంలో వినిపిస్తున్న ‘సెటిల్మెంట్’ ఆరోపణలు ఇలాంటి ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ప్రమాదాలు, అనుమానాస్పద మరణాలు, వైద్య చికిత్సపై ఆరోపణలు, విద్యార్థి ఆత్మహత్య వంటి ఘటనల్లో బాధిత కుటుంబాలతో మధ్యవర్తిత్వం పేరుతో నగదు పరిహారాలు ఇప్పించి కేసులు లేకుండా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి.
ప్రమాదం జరిగితే.. వెంటనే రాజీ?
ఇటీవల గద్వాల ఫ్లైఓవ్ప మద్యం మత్తులో కారు నడిపిన వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందిన ఘటనలో రాజకీయ పలుకుబడితో బాధిత కుటుంబంతో సుమారు రూ.8 లక్షలకు రాజీ కుది రిందన్న ప్రచారం ఉంది. అయితే ఈ ఆరోపణలకు అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది.
విద్యార్థి మరణం.. రూ.7 లక్షల చర్చ?
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిపై అధ్యాపకురాలు దాడి చేయడంతో అవమానానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మరణానికి ముందు విద్యార్థి రాసినట్లు చెబుతున్న లేఖ కూడా ఈ ఘటనలో కీలకంగా మారింది. ఈ వ్యవహారంలో బాధిత కుటుంబానికి సుమారు రూ.7 లక్షలు ఇప్పించేలా మధ్యవర్తిత్వం జరిగిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వైద్య నిర్లక్ష్య ఆరోపణలకూ పరిహారమే పరిష్కారమా?
ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బాలుడు మృతి చెందిన ఘటనలో వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో రూ.2 లక్షల పరిహారంతో ముగించేందుకు ప్రయత్నాలు జరిగాయన్న ప్రచారం ఉంది. నిజంగా వైద్య నిర్లక్ష్యం జరిగిందా? జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకున్నారా? అన్నది స్పష్టం కావాల్సి ఉంది.
‘డబ్బు ఇచ్చాం.. కేసు లేదు’ అనే భావన ప్రమాదకరం
బాధిత కుటుంబానికి పరిహారం అందించడం మానవతా దృక్పథంలో అవసరమే. కానీ పరిహారం చెల్లించడం వల్ల చట్టపరమైన నేరం ఆటోమేటిక్గా ముగిసిపోదు. ముఖ్యంగా మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాలు తీయడం, నిర్లక్ష్యం వల్ల మరణాలు, ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు వంటి అంశాల్లో పోలీసులు స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఒకరి ప్రాణానికి రూ.2 లక్షలు.. మరొకరి ప్రాణానికి రూ.7 లక్షలు.. ఇంకొకరి ప్రాణానికి రూ.8 లక్షలు అంటూ ‘రేట్లు’ నిర్ణయించే పరిస్థితి ఏర్పడితే అది సమాజానికి ప్రమాదకర సంకేతం. ప్రాణానికి ధర ఉండదు.. పరిహారం ప్రాణాన్ని తిరిగి ఇవ్వదు.
ఉన్నతాధికారులు దృష్టి సారించాలి
గద్వాలలో ఇలాంటి సెటిల్మెంట్లపై వస్తున్న ఆరోపణలు నిజమా? ఏ కేసుల్లో ఫిర్యాదులు నమోదయ్యాయి? ఎక్కడ రాజీ పేరుతో వ్యవహారాలు ముగిశాయి? రాజకీయ లేదా ఇతర ఒత్తిళ్లు ఉన్నాయా? అనే అంశాలపై పోలీసు ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. బాధిత కుటుంబాల కన్నీళ్లకు ధర నిర్ణయించే సంస్కృతి వేళ్లూనుకోకముందే అడ్డుకట్ట వేయాలి. లేకపోతే నేరస్థుడికి చట్టం కంటే ‘సెటిల్మెంట్’పైనే నమ్మకం పెరిగే ప్రమాదం ఉంది.






