24 August, 2026 | 2:43 AM

వందేమాతరం పేరుతో రాద్ధాంతం

24-08-2026 02:00 AM
  1. ప్రజాస్వామ్య పరిరక్షణ పౌరుల బాధ్యత
  2. రాజకీయ విశ్లేషకులు పరకాల ప్రభాకర్

ఎల్బీనగర్ , ఆగస్టు 23 : ప్రజాస్వామ్య పరిరక్షణ పౌరుల బాధ్యత అని రాజకీయ విశ్లేషకులు, ఆర్థికవేత్త, వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ అన్నారు. 80 ఏళ్ల స్వాతంత్రం పౌరుల హక్కులు అనే అంశంపై సహారా ఎస్టేట్ లో ఆదివారం సెమినార్ నిర్వహించారు.  సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు ఎన్.ఆదినారాయణ రెడ్డి అధ్యక్షతన వహించగా, ముఖ్య అతిథిగా రాజకీయ విశ్లేషకులు, ఆర్థికవేత్త, వ్యాఖ్యాత పరకాల ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. రాజ్యాంగం అనేదాన్ని ప్రజల రక్షణకై ఏర్పాటు చేసుకున్నాము.

కానీ  పాలకవర్గాలే రాజ్యాంగాన్ని బలహీనపరిచేటువంటి పరిస్థితుల్ని సృష్టిస్తున్నాయి. రాజ్యాంగంలో ఉన్న పౌరుల హక్కులను ఒక్కటొక్కటిగా నెమ్మది నెమ్మదిగా హరించే ప్రయత్నం కూడా జరుగుతున్నది. దీనిని ఎత్తిచూపవలసిన పత్రికలు, మీడియా 90 శాతం కార్పొరేట్ వర్గాల చేతుల్లో ఉండడంతో ప్రభుత్వ విధానాల్లో మంచి, చెడు ప్రజలకు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఏవి ఏవికూడా చర్చకు రావడం లేదని పరకాల ప్రభాకర్ పేర్కొన్నారు.

ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఏడీఆర్ అసోసియేషన్ (ఫర్ డెమొక్రటిక్ రిఫారమ్స్) అనే సంస్థ ఎత్తి  చూపుతుందన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని, ప్రజలు స్తబ్దతగా ఉన్నారని నిర్వేదం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగినట్లయితే భవిష్యత్తులో రాజ్యాంగం ఇలాగే ఉంటుందా ? ఉండదా చెప్పలేమని హెచ్చరించారు. వందేమాతరం, జనగణమన పేరుతో రాద్ధాంతం చేస్తూ పార్లమెంటులో ఎక్కువ సమయాన్ని వృథా  చేస్తున్నారని విమర్శించారు. 

ప్రజలు తమ పౌరసత్వాన్ని కాపాడుకోవాలంటే, పౌరులుగా, సంస్థలుగా  స్పందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు నోముల సుదర్శన్ రెడ్డి, నాయకులు రవీంద్ర శర్మ, డీఏఎస్ వీ ప్రసాద్ రావు, ఉమామహేశ్వరరావు, కామేష్ బాబు, ఎస్ కే జానీ, ఎన్.అంజయ్య, కీసరి నర్సిరెడ్డి, నర్సింహ, పృథ్వీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.