24 August, 2026 | 3:15 AM

ఉద్యమ చరిత్రకు అక్షర రూపం ఇవ్వాలి

24-08-2026 02:40 AM

ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు వేగవంతం చేయాలి: ప్రొఫెసర్ ఖాసీం

వరంగల్ (మహబూబాబాద్) ఆగస్టు 23 ( విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని ప్రభుత్వం గుర్తించాలని, ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం వేగవంతం చేయాలని, ఉద్యమ చరిత్రకు అక్షర రూపం ఇవ్వాలని ప్రొఫెసర్ ఖాసీం పేర్కొన్నారు. హనుమకొండ ప్రెస్ క్లబ్ హాలులో తెలంగాణ ప్రజాఫ్రంట్ పక్షాన నిర్వహించిన సమావేశంలో కొన్ని సలహాలు, సూచనలు అభిప్రాయాలను ప్రభుత్వం ముందు ఉంచారు. వాటిని సానుకూలంగా పరిశీలించి తక్షణ చర్యలు చేపట్టవలసిందిగా గుర్తింపు కమిటీని కోరారు.

భువనగిరి డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్, జనసభ, తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్, తెలంగాణ కళాసమితి, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ, తెలంగాణ ప్రజాఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక సమాఖ్య, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక తదితర సంస్థలు చేసిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాలను, త్యాగాలను తొలి, మలిదశ, తుదిదశ ఉద్యమాలను గుర్తించి చరిత్రగా రికార్డు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరత్వం పొందిన ఉద్యమ అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, వీరి సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.

తెలంగాణ ప్రజాఫ్రంట్ సంస్థ యొక్క నాయకత్వాన్ని ఉద్యమకారులుగా గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఉద్యమ సందర్భంతో పాటు అనంతరం నమోదు చేసిన కేసులన్నింటిని ఎత్తివేయాలన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షతో అమరత్వం పొందిన అమరుల స్మారక స్థూపాలను జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ప్రభుత్వమే నెలకొల్పి అధికారికంగా శ్రద్ధాంజలి ఘటించాలన్నారు. తెలంగాణ భాషా సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడాలని, తెలంగాణ అస్తిత్వానికి ఎట్టి పరిస్థితిల్లో భంగం వాటిల్లకుండా చూడాలని కోరారు. విద్య, జీవనోపాధి, ఆరోగ్యంతోపాటు సమాజంలో గౌరవంగా జీవించేలా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని మరొకసారి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు నాగభూషణం, ప్రధాన కార్యదర్శి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.