అణచివేతపై ఆందోళన!
ప్రభుత్వాలను ప్రశ్నించడం, ప్రజా సమస్యలపై గళం విప్పడం, అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడటం ప్రజాస్వామ్యానికి మూల సూత్రాలు. కానీ, ఇటీవలి కాలంలో మన దేశంలో రాజ్యాంగం ప్రసాదించిన ఈ హక్కుల అణచివేత క్రమంగా పెరిగిపోయిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
సాక్షాత్తూ సుప్రీంకోర్టు ఈ విషయాన్ని నొక్కి వక్కాణించడం దేశంలోని పరిస్థితిని తెలియజేస్తున్నది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా నీట్ ప్రశ్నాపత్రం లీక్‌పై శాంతియుతంగా నిరసన తెలిపిన యువతపై లాఠీచార్జి చేయడం, భద్రతా బలగాలు అక్రమ అరెస్టులకు దిగడం లాంటి పరిణామాల దృష్ట్యా సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. కాగా, ప్రజాస్వామ్యానికి భిన్నాభిప్రాయమే బలమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రజాభిప్రాయాన్ని, ముఖ్యంగా భిన్నాభిప్రాయాన్ని అణచివేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కడమే అవుతంది.
దేశంలోని అనేక చోట్ల శాంతియుత ఆందోళనలను అడ్డుకోవడం, నిరసన తెలిపే హక్కులను కాలరాయడం వంటి విపత్కర పరిణామాలు చోటుచేసుకున్న తరుణంలో నేర చరిత్ర లేని విద్యార్థులపై కేసులను ఉపసంహరించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం ముదావహం. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, ప్రజల సమస్యలను ఆలకించడం, విమర్శలను స్వీకరించడం, భిన్నాభిప్రాయాలను గౌరవించడం కూడా. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్యమనేది ప్రజల ప్రశ్నించే హక్కులోనే దాగి ఉంటుంది.
ప్రభుత్వ విధానాలను ప్రశ్నించిన ప్రతి ఒక్కరినీ నేరస్థులుగా చూడటం, బెయిల్ రాకుండా నెలలపాటు జైళ్లలో మగ్గేలా చేయడం, బెయిల్ మంజూరైనా కఠినమైన షరతులు విధించడం లాంటి ప్రమాదకర ధోరణి పెరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడుతుంది. చట్టాన్ని అమలు చేసే కార్యనిర్వాహక వ్యవస్థ ప్రజల హక్కులను పరిరక్షించాలే తప్ప, వాటిని హరించే సాధనంగా మారకూడదు. రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛను హరించడం, శాంతియుతంగా నిరసనలు చేసేవారిని నేరస్థులుగా చిత్రీకరించే అత్యంత ప్రమాదకర ధోరణి పెరిగిపోతున్న సమయంలో న్యాయవ్యవస్థ కలగజేసుకోవడం మన దేశ రాజ్యాంగానికి ఉన్న శక్తిని మరోసారి చాటిచెప్పిందని చెప్పక తప్పదు.






