బీసీ కోటా కోసం జెన్ జీ కదలాలి
టి.చిరంజీవులు :
2026 జూలై 25వ తేదీన భారత రాజకీయ చరిత్రలో ఒక విశేషమైన పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులు, యువత (బొద్దింకలు) చేపట్టిన ఉద్యమం ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది కేవలం ఒక మంత్రి రాజీనామా కాదు. ప్రజాస్వామ్యంలో సంఘటిత యువశక్తి ఎంత ప్రభావవంతంగా ఉంటుందో చూపించిన సంఘటన.
తెలుగులో ఒక సామెత ఉంది, ‘బలవంతమైన సర్పం సైతం చలి చీమల చేతజిక్కి చావదె సుమతి’ అని. గత పన్నెండు సంవత్సరాలుగా బలమైన మెజారిటీతో పాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం బొద్దింకలు (యువత) దాడికి దిగిరావాల్సి వచ్చింది. సమస్య ప్రజల జీవితాలను తాకినప్పుడు, ఉద్యమం శాంతియుతంగా, లక్ష్యసాధనతో కొనసాగినప్పుడు ప్రభుత్వాలు కూడా స్పందించక తప్పదని ఈ సంఘటన నిరూపించింది.
ఈ ఉద్యమంలో మరో గొప్ప విషయం ఏమిటంటే, నాయకత్వం విభిన్న సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన యువత చేతుల్లో ఉండటం. (సోనమ్ వాంగ్ చుక్, గిరిజన. అభిజిత్ దీప్కే, దళిత) దీనివల్ల ఒక విషయం స్పష్టమైంది. ప్రజల నిజమైన సమస్యల ముందు కులం, మతం, ప్రాంతం వంటి భేదాలు రెండో స్థానానికి వెళ్తాయి. ఉమ్మడి సమస్య ఉంటే యువత ఐక్యంగా పోరాడగలదని ఈ ఉద్యమం నిరూపించింది.
నేటి యువతను అర్థం చేసుకోకుండా నేటి రాజకీయాలను అర్థం చేసుకోవడం అసాధ్యం. ఎందుకంటే ఈ శతాబ్దా న్ని నిర్ణయించేది జెన్-జీ యువతే. ఈ యువత ఏం కోరుకుంటోంది? మొదటిది అవకాశా లు. తమ ప్రతిభకు తగిన అవకాశాలు కావాలని కోరుకుంటోంది. ఉద్యోగాలు పారదర్శకంగా రావాలి, నియామకాలు న్యాయంగా జరగాలి, కష్టానికి తగిన ఫలితం దక్కాలని ఆశిస్తోంది. రెండవది గౌరవం. ఈ తరం దానం కాదు, గౌరవం కోరుకుంటోంది.
సంక్షేమ పథకాల కంటే స్వశక్తితో ఎదిగే అవకాశాలను ఎక్కువగా విలువైనవిగా చూస్తోంది. మూడవది జవాబుదారీతనం. ప్రభుత్వం, రాజకీయ పార్టీలు, విశ్వవిద్యాలయాలు, సం స్థలు ఎవ్వరైనా ప్రజలకు జవాబుదారులుగా ఉండాలని ఈ తరం కోరుకుంటోంది. ప్రశ్నించే హక్కును తన ప్రజాస్వామ్య హక్కుగా భావిస్తోంది. నాలుగవది సమాన అవకాశా లు. కులం, మతం, లింగం, ప్రాంతం ఆధారంగా వివక్ష లేకుండా ప్రతిభకు గుర్తింపు లభించాలని కోరుకుంటోంది.
సామాజిక న్యాయం కూడా అదే సమయంలో అమలవాలని కోరుతోంది. ఐదవది భాగస్వామ్యం. తమ గురించి నిర్ణయాలు తీసుకునేటప్పుడు తమ గొంతు కూడా వినిపించాలని కోరుకుంటోంది. కేవలం ఓటు వేసే పౌరులుగా కాదు, విధాన రూపకల్పనలో భాగస్వాములుగా ఉండాలని భావిస్తోంది. ఆరవది పారదర్శకత. డిజిటల్ యుగంలో పెరిగిన ఈ తరం సమాచారాన్ని దాచిపెట్టడాన్ని అంగీకరించదు.
పరీక్షలు, నియామకాలు, పాలన అన్నింటిలోనూ స్పష్టత, పారదర్శకత కావాలని కోరుకుంటోంది. ఏడవది ప్రయోజనం ఉన్న జీవితం. ఈ తరం ఉద్యోగం కోసం మాత్రమే కాదు; సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచన కూడా కలిగి ఉంది. అందుకే పర్యావరణం, సామాజిక న్యాయం, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం వంటి అంశాలపై కూడా చురుకుగా స్పందిస్తోంది.
జెన్ -జీ యువత ప్రభుత్వాలను కూల్చాలని కోరుకోవడం లేదు. ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరుకుంటోంది. వారు వ్యవస్థను ధ్వంసం చేయాలని కోరుకోవడం లేదు. వ్యవస్థ న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నారు. వారు దయ కోరుకోవడం లేదు. అవకాశం కోరుకుంటున్నారు. వారు భిక్ష కోరుకోవడం లేదు. తమ హక్కులను కోరుకుంటున్నారు. ఈ సందేశాన్ని అర్థం చేసుకున్న నాయకత్వమే రేపటి భారతదేశాన్ని నిర్మిస్తుంది.
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కొంతమంది జెన్-జీ యువత, ముఖ్యంగా బహుజన యువ త ఆకర్షితులవుతున్నారనే విషయం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఇది సరైన అవగాహన లేకపోవడం వల్ల ఏర్పడుతున్న పరిస్థితి. అందువల్ల రిజర్వేషన్ విధానం వెనుక ఉన్న రాజ్యాంగపరమైన లక్ష్యం, సామాజిక న్యాయసూత్రాలను యువత లోతుగా అర్థం చేసుకోవాలి.
1990 ఆగస్టు 7న పార్లమెంట్‌లో మండల్ కమిషన్ సిఫారసుల అమలుపై జరిగిన చారిత్రాత్మక చర్చ సందర్భంగా అప్పటి ప్రధానమంత్రి వి.పి.సింగ్ వెల్లడించిన గణాంకాలు ఒక స్పష్టమైన వాస్తవాన్ని తెలియజేస్తాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వ గ్రూప్ ఏ (4.53%), గ్రూప్ బీ (10.63%) ఉద్యోగా ల్లో బీసీల ప్రాతినిధ్యం అత్యంత స్వల్పంగా ఉండేది.
రిజర్వేషన్లు అమల్లోకి వచ్చిన తరువాత కూడా ఈనాటికి ఆ వర్గాల్లో బీసీల ప్రాతినిధ్యం వారి రిజర్వేషన్ శాతానికి పూర్తిగా చేరుకోలేదు. (డీవోపీటీ వెబ్‌సైట్ ప్రకారం 2024 జనవరి 1 నాటికి గ్రూప్ ఏ (-19.14%), గ్రూప్ బీ (-21.95%) ఒకవేళ రిజర్వేషన్ విధానం లేకపోయి ఉంటే, అప్పటిలాగే నేటికీ అత్యున్నత స్థాయి ఉద్యోగాల్లో బీసీల ప్రాతినిధ్యం అతి తక్కువగానే ఉండేది.
గ్రూప్ ఏ, బీ ఉద్యోగాలు కేవలం సాధారణ కొలువులు కావు; అవి ప్రభుత్వ విధానాల రూపకల్పన, నిర్ణయాల అమలు, పరిపాలనా దిశను నిర్దేశించే కీలక స్థానాలు. దేశ జనాభాలో మెజారిటీగా ఉన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఈ నిర్ణయాత్మక వ్యవస్థల్లో తగిన ప్రాతినిధ్యం లేకపోతే, ప్రజాస్వామ్యం అసలు స్ఫూర్తి అయిన సమాన భాగస్వామ్యం దెబ్బతింటుంది.
అందువల్ల ముఖ్యంగా బహుజన యువత సోషల్ మీడియాలో వచ్చే అపోహలు లేదా అసంపూర్ణ సమాచారాన్ని నమ్మకుండా, రాజ్యాంగం, చరిత్ర, వాస్తవ గణాంకాలను అధ్యయనం చేసి రిజర్వేషన్ల ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. రిజర్వేషన్లు ఎవరికైనా ప్రత్యేక హక్కు కల్పించే విధానం కాదు; చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించి ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా, న్యాయబద్ధంగా మార్చే రాజ్యాంగ సాధనం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఉపఖండంలోనే ఉద్యమాలెందుకు?
ప్రపంచ చరిత్రను పరిశీలిస్తే ప్రతి సామాజిక, రాజకీయ, ఆర్థిక పరివర్తనకు యువతే చోదకశక్తిగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమాలైనా, ప్రజాస్వామ్య పరిరక్షణ పోరాటాలైనా, సామాజిక న్యాయ ఉద్యమాలైనా యువత ముందుండి నడిపించింది. అయితే ఇటీవలి కాలంలో ఒక ప్రత్యేకమైన ధోరణి కనిపిస్తోంది.
శ్రీలంకలో యువత ఉద్యమించింది. బం గ్లాదేశ్‌లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. నేపాల్లో యువత ప్రభుత్వాలను ప్రశ్నించిం ది. భారతదేశంలో కూడా వివిధ అంశాలపై విద్యార్థులు, యువత దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఇది యాదృచ్ఛికం కాదు. ఉపఖండ దేశాల సామాజిక, ఆర్థిక, రాజకీ య పరిస్థితులే ఈ ఉద్యమాలకు ప్రధాన కారణం.
మొదటి కారణం యువ జనాభా అధికంగా ఉండటం. భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్ , శ్రీలంక వంటి దేశాల్లో జనాభాలో గణనీయమైన శాతం యువతే. యువత ఎక్కువగా ఉంటే ఆశలు, ఆకాంక్షలు కూడా ఎక్కువగానే ఉంటాయి. కానీ, ఆ ఆశలకు తగిన అవకాశాలు లభించకపోతే అసంతృప్తి ఉద్యమంగా మారుతుంది.
రెండవ కారణం -నిరుద్యోగం, ఉపాధి సంక్షోభం. లక్షలాది మంది యువకులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నప్పటికీ వారికి తగిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ప్రభుత్వ నియామకాలలో ఆలస్యం, ఖాళీల భర్తీ లేకపోవడం, పోటీపరీక్షల నిర్వహణపై సందేహాలు వంటి అంశాలు యువతలో నిరాశను పెంచుతున్నాయి.
చదివినా ఉద్యోగం రాకపోతే ఆవేదన ఉద్యమంగా మారడం సహజం. మూడవ కారణం -ఆర్థిక, సామాజిక అసమానతలు. అభివృద్ధి జరుగుతోందని గణాంకాలు చెబుతున్నప్పటికీ, ఆ అభివృద్ధి ఫలాలు అందరికీ సమానంగా చేరడం లేదు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతుండగా, సాధారణ కుటుంబాల యువత అవకాశాల కోసం తీవ్రంగా పోటీపడాల్సి వస్తోంది. దీనివల్ల వ్యవస్థపై అసంతృప్తి పెరుగుతోంది.
నాలుగవ కారణం ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం తగ్గడం. సమస్యలు పరిష్కారం కాకపోవడం, పరిపాలనలో జాప్యం, ప్రజల ఆవేదనకు తక్షణ స్పందన లేకపోవడం వంటి అంశాలు యువతను వీధుల్లోకి తీసుకొస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో వినిపించని స్వరం చివరకు ఉద్యమంగా మారుతుంది. ఐదవ కారణం సోషల్ మీడియా. ఒక దేశంలో జరిగిన ఉద్యమం కొన్ని నిమిషాల్లోనే మరో దేశ యువతకు చేరుతోంది.
అనుభవాలు, వ్యూహాలు, నినాదాలు, సంఘీభావం అన్నీ సరిహద్దులను దాటి ప్రయాణిస్తున్నాయి. అందువల్ల స్థానిక సమస్యలు కూడా అంతర్జాతీ య చైతన్యానికి అనుసంధానమవుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ కేంద్రంగా జరిగిన యువజన ఉద్యమం కూడా ఈ మారుతున్న రాజకీయ, సామాజిక వాస్తవికతకు ఒక ఉదాహరణగా నిలిచింది. భవిష్యత్తులో ఈ ఉద్యమం ఏ మలుపు తిరుగుతుందన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది
బీసీ ఉద్యమం ఏం నేర్చుకోవాలి?
మొదటగా, యువతను ఉద్యమానికి కేంద్రబిందువుగా చేయాలి. ఏ చారిత్రక ఉద్యమమూ యువత లేకుండా విజయం సాధించలేదు. కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యోగార్థులు, యువ మహిళలు వీళ్లంద రూ ఉద్యమంలో భాగస్వాములు కావాలి. బీసీ బొద్దింకలు బయటకు రావాలి. రెండవది, హిస్సా (అస్తిత్వం), ఇజ్జత్ (ఆత్మగౌర వం), హుకుమత్ (అధికారం) సిద్ధాంతాన్ని ప్రతి బీసీ యువకుడి జీవిత లక్ష్యంగా మార్చాలి. మనకు సిద్ధాంతం ఉంది. కానీ, అది ఇంకా ప్రతి గ్రామానికి, ప్రతి విద్యార్థికి, ప్రతి కుటుంబానికి పూర్తిగా చేరలేదు. ఈ మూడు పదాలు ఉద్యమ నినాదాలు మాత్ర మే కాదు; భవిష్యత్తు కార్యాచరణ కావాలి.
మూడవది, పార్టీలకు అతీతమైన బీసీ ఐక్యతను నిర్మించాలి. నేడు అనేక బీసీ సం ఘాలు వేర్వేరు రాజకీయ పార్టీలకు దగ్గరగా పనిచేస్తున్నాయి. అది ప్రజాస్వామ్యంలో సహజమే. కానీ, బీసీల హక్కుల విషయంలో అందరూ ఒకే వేదికపై నిలబడాలి. రాజకీ య పార్టీలు వేరు కావచ్చు; కానీ బీసీల ప్రయోజనాలు ఒక్కటే. నాలుగవది, ఉద్యమాన్ని శాశ్వత సంస్థాగత నిర్మాణంగా మార్చాలి. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు, యువజన విభాగాలు, మహిళా విభాగాలు, న్యాయ బృందాలు, పరిశోధన విభాగాలు, డిజిటల్ ప్రచార వ్యవస్థ ఇవన్నీ బలపడితేనే ఉద్యమం నిలకడగా ఉంటుంది.
ఐదవది, గణాంకాలు, రాజ్యాంగం, చట్టాల ఆధారంగా ఉద్యమాన్ని ముందుకు నడపా లి. నినాదాలు ప్రజలను ఆకర్షిస్తాయి. కానీ, వాస్తవాలు ప్రభుత్వాలను ఒప్పిస్తాయి. అందుకే ప్రతి డిమాండ్‌కు రాజ్యాంగపరమై న, చట్టపరమైన, గణాంకపరమైన ఆధారా లు ఉండాలి. ఆరవది, ఒకే డిమాండ్ చుట్టూ సమాజాన్ని ఐక్యం చేయాలి. జంతర్ మంతర్ ఉద్యమంలో విద్యార్థులు పరీక్షల పారదర్శకత, జవాబుదారీతనాన్ని ప్రధాన అంశంగా తీసుకున్నారు.
తెలంగాణలో బీసీ ఉద్యమం కూడా 42 శాతం రిజర్వేషన్లు, జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం, రాజ్యాంగబద్ధ హక్కుల అమలు, బీసీలపై దాడులు వంటి స్పష్టమైన లక్ష్యాల చుట్టూ సమీకృతం కావాలి. ఏడవది సోషల్ మీడియా, ప్రజా ఉద్యమాన్ని కలిపి నడపాలి. కేవలం సభలు సరిపోవు. కేవలం పోస్టులు కూడా సరిపోవు. రెండూ కలిసి పనిచేసినప్పుడే ఉద్యమం ప్రజల్లోకి వెళ్తుంది.
చివరగా ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. తెలంగాణ బీసీ ఉద్యమం సామాజిక న్యా యం, సమాన ప్రాతినిధ్యం, ఆర్థిక సాధికారత, ఆత్మగౌరవం, రాజ్యాధికార ఉద్యమంగా ఎదగాలి. మనకు సంఖ్యాబలం ఉంది. మనకు చరిత్ర ఉంది. మనకు ‘హిస్సా ఇజ్జత్ హుకుమత్’ అనే స్పష్టమైన సిద్ధాంతం ఉంది.
ఇప్పుడు అవసరమైంది ఒక్కటే యువతను ఈ సిద్ధాంతంతో చైతన్యపరచడం, అన్ని బీసీ వర్గాలను ఒకే లక్ష్యంతో సమీకరించడం. యువత కదిలితే సమాజం కదులుతుంది. సమాజం కదిలితే రాజకీయాలు మారుతా యి. రాజకీయాలు మారితేనే హిస్సా వస్తుం ది. హిస్సా వచ్చినప్పుడే ఇజ్జత్ వస్తుంది. ఇజ్జత్ వచ్చినప్పుడే హుకుమత్ సాధ్యమవుతుంది. అదే తెలంగాణ బీసీ ఉద్యమం నిర్మించాల్సిన కొత్త చరిత్ర.
వ్యాసకర్త: విశ్రాంత ఐఏఎస్,
బీసీ ఇంటెలెక్చువల్ ఫోరమ్ చైర్మన్






